ప్రభాకర్​ రావు, శ్రవణ్​ పాస్​ పోర్టులు రద్దు

Passports of Prabhakar Rao and Shravan are cancelled

Nov 30, 2024 - 22:21
 0
ప్రభాకర్​ రావు, శ్రవణ్​ పాస్​ పోర్టులు రద్దు

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కేంద్రం సంచలన నిర్ణయం
పాస్​ పోర్టు రద్దుపై సవాల్ చేసిన ప్రభాకర్​ రావు
కేంద్ర హోంశాఖ లో పిటిషన్​
నన్ను తెలంగాణ సర్కార్​ వేధిస్తున్నని ఆవేదన
ఫ్లొరిడాలో ప్రభాకర్​ రావు, చికాగోలో శ్రవణ్​ రావు 

నా తెలంగాణ, హైదరాబాద్​ :  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. కేసు దర్యాప్తు ప్రారంభం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ప్రముఖ మీడియా నిర్వహకుడు శ్రవణ్​ రావు అమెరికాలో తలదాచుకున్నారు. దాంతో వారిని భారత్​ కు రప్పించేందుకు రాష్ట్ర పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. అటు ప్రభాకర్​ రావు సైతం తనను రాజకీయ శరణార్ధిగా గుర్తించాలంటూ అమెరికా సర్కార్​ ను విన్నవించుకున్నాడు. వీరిని ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోకుండా కేంద్ర ప్రభుత్వమూ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభాకర్‌రావుతో పాటు శ్రవణ్ రావు పాస్‌పోర్టులను సస్పెండ్​ చేస్తూ కేంద్రం శనివారం కీలక నిర్ణయం తీసుకున్నది. దాంతో పాస్‌పోర్ట్‌ సస్పెండ్‌ను ప్రభాకర్ రావు సవాల్ చేశారు. తన పాస్‌పోర్టును రద్దు చేయొద్దని భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తనను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు పోలీసులు సైతం ఇద్దరి పాస్‌పోర్టులు రద్దు చేయాలని కేంద్రానికి సిఫారసు చేశారు. కాగా.. ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చిన రోజే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. చికిత్స కోసం అని వెళ్లిన ఆయన అప్పటి నుంచి అక్కడే ఉండిపోయారు. ఇప్పటికే ఆయనకు తెలంగాణ పోలీసులు మెయిల్ ద్వారా నోటీసులు పంపించారు. కానీ, స్వదేశానికి తిరిగి రాని ప్రభాకర్​ రావు.. అక్కడే ఉండేందుకు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. ఇదే క్రమంలో ఆయన ఫ్లోరిడాలో ఉంటున్న తన కుమారుడి ద్వారా అమెరికా నుంచి గ్రీన్‌ కార్డు పొందారు. దాంతో ఆయనకు అక్కడే శాశ్వతంగా ఉండే వెసులుబాటు లభించింది. ఈ పరిణామంతోనే ట్యాపింగ్ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక తెలంగాణ పోలీసులు సతమతమవుతున్నారు. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఇప్పటికే నలుగురు పోలీసులు నిందితులుగా అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్‌రావు ఫ్లోరిడాలో ఉండగా.. మరో నిందితుడు శ్రవణ్ రావు చికాగోలు ఉన్నారు.