సమగ్ర బీసీ కులగణన చేపట్టాల్సిందే

బీసీ ఆజాదీ యూత్​ ఫెడరేషన్​ ఆమరణ నిరాహార దీక్ష కన్వీనర్​ జక్కని సంజయ్​ కుమార్​ అరెస్ట్​

Aug 25, 2024 - 17:41
 0
సమగ్ర బీసీ కులగణన చేపట్టాల్సిందే

నా తెలంగాణ, హైదరాబాద్​: సమగ్ర కులగణన ప్రక్రియను వెంటనే ఆరంభించాలని బీసీ ఆజాదీ యూత్​ ఫెడరేషన్​ కన్వీనర్​ జక్కని సంజయ్​ కుమార్​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. హిమాయత్​ నగర్​ లోని బీసీ ఆజాదీ యూత్​ ఫెడరేషన్​ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జక్కని పలువురితో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కాగా ఆమరణ నిరాహార దీక్ష విషయం తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు జక్కనితోపాటు పలువురిని అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​ కు తరలించారు. ఈ దీక్షకు అనుమతి లేదన్నారు.

అంతకుముందు జక్కని సంజయ్​ కుమార్​ మీడియాతో మాట్లాడుతూ.. బీసీల కులగణనపై రేవంత్​ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్​ అమలుపై ప్రభుత్వం ఇచ్చిన హామీపై వైఖరి స్పష్టం చేయాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు వాటా అందించాకే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్​ చేశారు. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవుతుండడం పట్ల ఆయన ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఈ నిర్ణయం బీసీలకు అన్యాయం చేయడమే అన్నారు. రెడ్డి కులానికి మాత్రమే పెద్దపీట వేస్తూ బీసీ కులాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్​ వెంటనే బీసీ కులగణన చేపట్టి రిజర్వేషన్ల ద్వారా రాజకీయాల్లో ప్రవేశం కల్పించాలన్నారు. లేకుంటే పెద్ద యెత్తున ఆందోళనలకు దిగుతామని జక్కని హెచ్చరించారు. 

ప్రజా సంక్షేమాన్ని మరిచిన రేవంత్​ కాంగ్రెస్​ ప్రభుత్వం ఢిల్లీకి, అమెరికాలకు తిరగడమే సరిపోతుందన్నారు. మరి బీసీ హక్కులకు ఎన్నికల్లో ఇచ్చిన మాటలు నీటిమూటలుగానే మిగిలాయన్నారు. హక్కులు సాధించే వరకు తన నిరాహార దీక్ష ఆపబోనని జక్కని సంజయ్​ కుమార్​ హెచ్చరించారు.