ఇజ్రాయెల్–ఇరాన్ ప్రయాణాలు చేయొద్దు
మంత్రిత్వ శాఖ ఇరుదేశాల్లో హై టెన్షన్ నేపథ్యంలోనే నిర్ణయం
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు ఆ దేశాలకు ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయాణ సలహాలను జారీ చేసింది. మరోసారి ప్రయాణాలపై నోటీసులు జారీ చేసే వరకు భారతీయులు ఆ ప్రాంతాలకు వెళ్లకూడదని తెలిపింది. శుక్రవారం హెచ్చరికతో కూడిన నోటీసును విదేశీ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఇరుదేశాల్లో ఉన్న భారతీయులు ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలతో సంప్రదింపుల్లో ఉండాలని పేర్కొంది.
ఇరాన్ రానున్న 48 గంటల్లో ఇజ్రాయెల్ పై దాడి చేసే అవకాశాలు ఉన్నందునే ఈ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం అక్కడ ఉన్న భారతీయుల కోసం నిరంతరం భద్రతా చర్యలకు సంబంధించి శ్రద్ధ వహిస్తోందని పేర్కొంది. వీలైనంత మేరకు ఓ మూడు, నాలుగు రోజులపాటు బయటికి వెళ్లకుండా ఉంటే మంచిదని పేర్కొంది. అదే సమయంలో భారత కార్యాలయాలను సంప్రదించి తమ తమ పేర్లను అందజేయాలని సూచించింది. ఒకవేళ ఇరుదేశాల మధ్యయుద్ధం అనివార్యమైతే భారతీయుల క్షేమం కోసమే తామీ నోటీసును జారీ చేసినట్లు వివరించింది.