పన్నులను సున్నాకు తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
పునరుత్పాదక శక్తిని పెంచాలి నూతన పరిశోధనలు మరిన్ని అవసరం విద్యార్థుల కృషి వల్లే 9 పెటెంట్లు కాన్వొకేషన్ సదస్సులో మంత్రి నిర్మలా సీతారామన్
భోపాల్: పన్నులను సున్నాకు తేవాలనేదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కానీ ప్రస్తుత దేశ అవసరాలు ఎక్కువగా ఉండడం అందరికీ తెలిసిందే అన్నారు. అనేక సవాళ్ల మధ్య దేశ పౌరులకు ఎలాంటి భారం కాకుండా పన్నుల విధానాన్ని అనుసరించామని మంత్రి తెలిపారు. ఇతరులు మనకు డబ్బు ఇస్తారని వేచి చూడడం కన్నా దేశాభివృద్ధిని మన డబ్బుతోనే ముందుకు తీసుకువెళితే భవిష్యత్ లో అభివృద్ధి కల సాకారంతోపాటు పన్నుల భారాన్ని భారీగా తగ్గించేందుకు వీలు కలుగుతుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
మంగళవారం భోపాల్‌లో జరిగిన కాన్వొకేషన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) 11వ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి సీతారామన్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె క్యాంపస్‌లో అకడమిక్ భవనం, లెక్చర్ హాల్‌కు శంకుస్థాపన చేశారు. 442 మంది పరిశోధకులకు పట్టాలను ప్రదానం చేశారు.
డిగ్రీలు కోరుకునే విద్యార్థులు నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధనా రంగంలో మరిన్ని అవకాశాలను సృష్టిస్తూ పునరుత్పాదక శక్తిని పెంచాలని కోరారు. ఇంధన, విద్యుత్, సోలార్, థర్మల్ లాంటి రంగాల్లో మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.
ఇప్పటికే ఐఐఎస్‌ఈఆర్ మూడువేల ప్రచురణలను ప్రచురించిందని గుర్తు చేశారు. ఈ కళాశాల ర్యాంకింగ్ కూడా అత్యంత మెరుగ్గా ఉందన్నారు. విద్యార్థుల కృషి వల్ల 8 నుంచి 9 పెటెంట్లు లభించాయన్నారు. డేటా సైన్స్ లో మరిన్ని పరిశోధనలు అవసరమన్నారు. ప్రస్తుతం 4 జీ నుంచి 5జీకి వెళ్లగలగడం సంతోషకరమని తెలిపారు.