తమిళనాడుపై బీజేపీ గురి

 బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నది. కాషాయ పార్టీ అందుకు తగ్గట్టుగానే పథకం రచిస్తోంది. 

Apr 12, 2024 - 18:50
 0
తమిళనాడుపై బీజేపీ గురి

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నది. కాషాయ పార్టీ అందుకు తగ్గట్టుగానే పథకం రచిస్తోంది. 

దేశంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపక్ష పార్టీలకంటే ముందున్నారు. ఆయా రాష్ట్రాల్లో పట్టుసాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2014, 2019లో జరగని ఒక్క విశేషం ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నది. తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ దృష్టి సారించింది. గత వందరోజుల్లోనే తమిళనాడుకు మోదీ ఏడుసార్లు వెళ్లారు. బీజేపీకి చెందిన ఓ అగ్రనేత ఇన్నిసార్లు రాష్ట్రానికి వెళ్లడం ఇదే ప్రథమం. వివిధ అభివృద్ధి పథకాల  ప్రారంభోత్సవాలు, ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు.  బీజేపీకి బలమైన నియోజకవర్గాలే కాకుండా, తమిళనాడులో ఉన్న అనేక తీర్థ క్షేత్రాలు, రాముడితో ముడిపడి ఉన్న దేవాలయాలను సందర్శించారు. గతంలో ఏ ప్రధానీ నిర్వహించనటువంటి రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖులను కలుస్తున్నారు. దీంతో ప్రధానికి అక్కడి ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించింది.  

ఓటింగ్ శాతం పెంచడం కోసమే..

తమిళనాడులో గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 3శాతం నుంచి 3.5శాతం మాత్రమే ఓటింగ్​ నమోదు అయ్యేది. దీన్ని డబుల్ డిజిట్ లోకి తీసుకువచ్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. మోదీ పర్యటనల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో 13శాతం నుంచి 25శాతం వరకు ఓటింగ్​ శాతం పెరగవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కోయంబత్తూరు, పెరంబలూర్​, పెల్లూర్, నిలగిరి, సౌత్​చెన్నై, విరుధునగర్ స్థానాలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఈ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు పాటు పడుతున్నారు. ఈ సీట్లలో గతంలో స్థానిక పార్టీల పొత్తులో భాగంగా సుమారు 24 నుంచి 33శాతం ఓటింగ్​ తీసుకు రాగలిగారు. దాదాపు త్రికోణపు పోటీ ఇచ్చారు. కోయంబత్తూరు అభ్యర్థిగా అన్నామలై పోటీ చేస్తున్నారు. పెరంబలూర్​అభ్యర్థి టీఆర్ పారివేంధర్, పెల్లూర్ ​అభ్యర్థిగా ఏసీ షణ్ముగం, నీలగిరి అభ్యర్థిగా కేంద్రమంత్రి డా. ఎల్ మురుగన్ పోటీ చేస్తున్నారు. సౌత్​చెన్నై అభ్యర్థిగా తెలంగాణ మాజీ గవర్నర్​ తమిళిసై సౌందర్​రాజన్​ పోటీలో ఉన్నారు. విరుధునగర్ ​అభ్యర్థిగా సినీనటి రాధిక పోటీ చేస్తున్నారు. వీరి గెలుపే లక్ష్యంగా ప్రధాని ప్రచారం ఉండంనుంది. 

దక్షిణ భారతంపై గురి..

ప్రధాని మోడీ ఈసారి దక్షిణ భారతదేశంపై దృష్టి పెట్టారు. నార్తు, ఈస్ట్, వెస్ట్ ​ఇండియా ప్రాంతాల్లో బీజేపీకి మంచి పట్టు ఉంది. అక్కడ అనుకున్నమేర సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో సౌత్ ఇండియా రాష్ట్రాలు తెలంగాణ, కర్నాటక, తమిళనాడుపై  బీజేపీ దృష్టి సారించింది. కేరళలో పాగా వేసేందుకు కసరత్తు చేస్తోంది.  తెలంగాణ, తమిళనాడు, కేరళలో ప్రధాని పదేపదే పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికలు ముగిసేలోపు సౌత్​ ఇండియాలో ప్రధాని మరిన్ని సూడిగాలి పర్యటనలు 
 చేయనున్నట్లు తెలుస్తోంది. ఏ మేరకు సీట్లు వచ్చినా.. ఓటింగ్ శాతం, స్థానికంగా పార్టీని బలోపేతం చేయడం, నాయకుల్లో విశ్వాసం నింపే ప్రయత్నంపై కాషాయ పార్టీ దృష్టి పెట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.  

రాకా సుధాకర్​ రావు
రాజకీయ విశ్లేషకులు