సింగరేణిని ప్రైవేటీకరించం

కార్మికుల సంక్షేమమే తమ ఉద్దేశ్యం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి

Jun 22, 2024 - 17:42
 0
సింగరేణిని ప్రైవేటీకరించం

నా తెలంగాణ, హైదరాబాద్​: సింగరేణిని గత ప్రభుత్వం కేసీఆర్​, ఆయన కుటుంబం, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు దోచుకుతిన్నారని ఆయా విషయాలన్నీ తెలిసి కూడా ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం విచారణ ఎందుకు కోరడం లేదని బీజేపీ రాష్​ర్ట అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనే కేంద్రానికి లేదన్నారు. తమకు సింగరేణి బలోపేతం, కార్మికుల సంక్షేమంపై మాత్రమే దృష్టి ఉందని మంత్రి తెలిపారు. శనివారం హైదరాబాద్​ లోని బీజేపీ కార్యాలయంలో మంత్రి కిషన్​ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

విద్యుత్​ బకాయిలూ చెల్లించలేదు..

సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నా ఏనాడు దాని బాగోగుల విషయంలో కేంద్రాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోలేదన్నారు. పైగా కేంద్రం సింగరేణిని అమ్మేయాలనుకుంటుందని అసత్య ప్రచారాలతో తమ రాజకీయ పబ్బం గడుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్​ సంస్థలకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా చెల్లించలేదని తెలిపారు. దీంతో విద్యుత్​ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందని కిషన్​ రెడ్డి మండిపడ్డారు. 

సింగరేణిలో కేసీఆర్​ ప్రోటోకాల్!

2014 కంటే ముందు రూ. 3500 కోట్ల లాభాలతో ఉన్న సంస్థను బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక పూర్తిగా నష్టాల్లోకి నెట్టేలా చేశారన్నారు. సింగరేణి సంస్థలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్​ పాటించాలని కేసీఆర్​ ఆదేశించారని ఆరోపించారు. తద్ఫలితంగా ఆ సంస్థలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేసీఆర్​, వారి కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ అధికారులు చక్కర్లు కొట్టాల్సి వచ్చిందన్నారు. చివరికి ఒక కార్మికుని షిఫ్ట్​ మార్చాలంటే కూడా వారే మోనోపాలిగా వ్యవహరించేవారని మండిపడ్డారు.

బాగోగులు పట్టించుకోలే..

సింగరేణి ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అని అందులో కేంద్రానికి వాటా ఉందన్న విషయాన్ని పూర్తిగా కేసీఆర్​ విస్మరించారని కిషన్​ రెడ్డి మండిపడ్డారు. ఓట్లను దండుకునేందుకు సింగరేణిని, యూనియన్​ కార్మికులను ఉపయోగించుకున్నారే తప్ప ఏనాడు ఆ సంస్థ బాగోగులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. విద్యుత్​ సంస్థలకు రూ. 2.5 కోట్ల బకాయిలను కూడా చెల్లించలేకపోయారని తెలిపారు. 

ఒడిశా సింగరేణి వాటా ఉత్పత్తి మరిచారెందుకు?

సింగరేణికి ఒడిశాలోనూ నైనీ కోల్డ్​ బొగ్గు బ్లాక్​ ఉన్నదన్న సంగతినే మరిచిపోయారని కిషన్​ రెడ్డి తెలిపారు. రాజకీయంగా దేశమంతా పర్యటించిన కేసీఆర్​ అప్పటి ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​ తో ఎన్నోసార్లు భేటీ అయ్యారని కానీ ఒక్కసారి కూడా ఈ బ్లాక్​ లో బొగ్గు ఉత్పత్తి గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ఒకవేళ ఉత్పత్తి ప్రారంభించి ఉంటే సింగరేణికి 15 శాతం బొగ్గు లభించేదన్నారు. దీంతో సింగరేణి లాభాల్లో వృద్ధి చేకూరేదన్నారు. 

అధికారులనూ తొక్కిపెట్టారు..

కార్మికులు, సంస్థ యోగక్షేమాలను ఏనాడు పట్టించకున్న పాపాన కేసీఆర్​ పోలేదని కిషన్​ రెడ్డి విమర్శించారు. కార్మికుల షిఫ్ట్​ మార్పిడులు, భూములు, క్వార్టర్లు కేటాయించడం లాంటి వాటిని కూడా తమ చేతుల్లో పెట్టుకొని ఉన్నతాధికారులను సైతం తమ ఆదేశాలు పాటించేలా తొక్కి పెట్టారని మండిపడ్డారు. 

స్వలాభం కోసమే భ్రష్టు పట్టించారు..

కేసీఆర్ హయాంలో తెలంగాణను అన్ని రంగాల్లోనూ భ్రష్టు పట్టించి తన స్వలాభం, కుటుంబ, పార్టీ లాభాలనే చూసుకున్నారని కిషన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ, నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్​, ఉద్యోగాలు, రేషన్​ కార్డులు లాంటి హామీలన్నీ శుద్ధ అబద్ధాలని ప్రజలు తేల్చేశారన్నారు. 

ప్రైవేటీకరణ ఆలోచనే లేదు..

తెలంగాణలో 13 అతిపెద్ద పరిశ్రమలు ఉన్నాయని వాటిని ఏనాడూ ప్రైవేటీకరించాలన్న ఉద్దేశ్యం కేంద్రానికి, మోదీ ప్రభుత్వానికి లేదన్నారు. ఇదే విషయాన్ని గతంలో మోదీ సభలో కూడా స్పష్టం చేశారని కిషన్​ రెడ్డి గుర్తు చేశారు. విద్యుత్​ ఉత్పాదనకు బొగ్గే ప్రధానమైనదని తెలిపారు. దీని ద్వారానే దేశంలో 85 శాతం విద్యుత్​ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. 

విచారణ ఎందుకు కోరరు..

ఓ వైపు కేసీఆర్​, బీఆర్​ఎస్​ పార్టీని విమర్శిస్తున్న కాంగ్రెస్​ పార్టీ ఎందుకు ఇలాంటి విషయాలపై విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. రెండు పార్టీలు ‘దొందూ దొందే’ అని కిషన్​ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్​ హయాంలో సీతారామకేసరి తెల్లకాగితం ముక్క రాసిచ్చిన వారికే అప్పటి ప్రధాని మన్మోహన్​ సింగ్​ బొగ్గు గనుల కాంట్రాక్టులను కేటాయించారని గుర్తు చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే వారిని అణగదొక్కారని గుర్తు చేశారు. ఈ విషయం చివరకు సుప్రీం కోర్టు వరకు చేరి మొట్టికాయలు కూడా తిన్నారని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి గుర్తు చేశారు.