మైక్రోసాఫ్ట్​ క్లౌడ్​ సేవల్లో అంతరాయం

సర్వర్ల అప్​ డేట్ లో సమస్యా, హ్యాకర్ల పనా ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన పలు సేవలు విమానరాకపోకలు అంతరాయం

Jul 19, 2024 - 20:13
Jul 19, 2024 - 21:13
 0
మైక్రోసాఫ్ట్​ క్లౌడ్​ సేవల్లో అంతరాయం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మైక్రోసాఫ్ట్​ అందిస్తున్న క్లౌడ్​ ఆధారిత సేవల్లో శుక్రవారం ఉదయం నుంచి అంతరాయం నెలకొంది. దీంతో భారత్​ తోపాటు పలు దేశాల్లో తీవ్ర అలజడి చెలరేగింది. ఈ సేవలను వినియోగిస్తున్న పెద్ద పెద్ద సంస్థల్లో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇందులో ఐటీ కంపెనీలు, విమానయాన సేవలు, బ్యాంకులు, ఆసుపత్రులు, బ్యాంకులపై ఈ ప్రభావం భారీగా పడింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా షేర్​ మార్కెట్ల కొనుగోళ్లపై కూడా ప్రభావం చూపింది. దీంతో భారీ ఎత్తున భారత్​ సహా ఇతర దేశాల మార్కెట్లు తీవ్రంగా నష్టాన్ని చవిచూశాయి. 

సమస్యలు..

మైక్రో సాఫ్ట్​ 360, విండోస్​, టీమ్​, అజ్యూర్​, స్టోర్​, క్లౌడ్​ ల సేవలకు అంతరాయం కలిగింది. అంతరాయం నేపథ్యంలో ఇతర కంపెనీల ఫ్లాట్​ ఫారమ్​ లను ఉపయోగించేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉదయం రెండు గంటలపాటు ఈ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సిస్టమ్​ లో ఎర్రర్​ ఆప్షన్​ లు కనిపించాయి. 

అమెరికా వ్యాప్తంగా సేవల ఆటంకంతో వందలాది విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వివిధ విమాన సంస్థలు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కనీసం చెక్​ ఇన్​ కౌంటర్లు కూడా తెరవకుండా మూసివేయడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అత్యవసర సేవలపై కూడా ఈ ప్రభావం పడడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. 

భారత్​ లోనూ ఈ సేవల్లో అంతరాయంతో 200 విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్​, ముంబై సహా పలు ప్రధాన నగరాల్లోని విమానసేవలకు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీల సేవలకు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడింది.

మైక్రోసాఫ్ట్​ స్పందన..

మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయంపై సంస్థ స్పందించింది. సేవల అంతరాయానికి అప్​ డేట్​ వర్షన్​ లో బగ్​ కారణమని పేర్కొంది. సైబర్​ దాడి, హ్యాకర్ల పని కాదని తెలిపింది. మరోవైపు అప్​ డేట్​ వెర్షన్​ ను విడుదల చేశామని పేర్కొంది. అదే సమయంలో ఈ బగ్​ ను నిర్మూలించేందుకు మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్​ డేట్​ వెర్షన్​ తో సేవలు యథాతథంగా కొనసాగించుకోవచ్చని మైక్రోసాఫ్ట్​ ప్రకటించింది.

హ్యాకర్ల పనే?..

అమెరికన్ యాంటీ-వైరస్ కంపెనీ నుంచి వచ్చిన అప్‌డేట్ మైక్రోసాఫ్ట్‌ను ప్రభావితం చేశాయనే ఆరోపణలు, మరోవైపు రష్యాకు చెందిన హ్యాకర్లు ఈ సర్వర్లలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించి ఉంటారన్న అనుమానాలు కూడా నెలకొన్నాయి. అయితే సమస్య తలెత్తడం వెనుక ఖచ్చితమైన కారణాలు మాత్రం సంస్త నిపుణులు ఇంకా ప్రకటించలేదు. ఉదయం సేవలకు అంతరాయం కలిగుతున్నందుకు చింతిస్తున్నామన్న మైక్రోసాప్​ట్​ సంస్థ ప్రకటించింది. మరోవైపు మైక్రోసాఫ్ట్​ సర్వర్ల అప్​ డేట్​ వల్లే ఈ సమస్య తలెత్తిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. 

అమెరికా డేటా తస్కరించిన రష్యా హ్యాకర్లు?..

గతంలోనూ మైక్రోసాఫ్ట్​ సర్వర్లలోకి రష్యాకు చెందిన హ్యాకర్లు చొరబడి కీలక డేటా దొంగిలించారనే ఆరోపణలున్నాయి. ఈ సర్వర్లలోని అమెరికా రక్షణ శాఖకు చెందిన సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నించారని పలువురు సైబర్​ నిపుణులు చెబుతున్నారు. అయినా పూర్తి కారణం ఏంటనేది తెలిసే వరకు ఆరోపణలు చేయడం తగదని మరికొంతమంది సైబర్​ నిపుణులు చెబుతుండడం విశేషం.

మంత్రి అశ్వినీ వైష్ణవ్​..


మైక్రోసాఫ్ట్​ సేవల అంతరాయంపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​ మాట్లాడారు. సేవల అంతరాయం తాత్కాలికమేనన్నారు. కేంద్రం ఆ సంస్థతో నిరంతరం సంప్రదింపుల్లో ఉందన్నారు. అదేసమయంలో భారత్​ లో సేవల అంతరాయాన్ని గుర్తించామని తెలిపారు. దీనిపై సెర్ట్​ సాంకేతిక సలహాలను జారీ చేస్తుందన్నారు. 

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు..

భారత స్టాక్​ మార్కెట్​ లపై మైక్రోసాఫ్ట్​ సర్వర్ల సమస్య తీవ్రంగా ప్రభావం చూపింది. పలు సంస్థలకు చెందిన షేర్లు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. అనుకున్న సమయానికి షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల్లో జాప్యం వల్ల మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి.