వడదెబ్బతో 24 గంటల్లో 14 మంది మృతి
బిహార్ పలు ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ ఏసీలు, ఫ్రిడ్జీలు నిరంతరం నడపొద్దు ఉదయం 10 గంటల తరువాత బయటికి వెళ్లొద్దు విద్యాశాఖాధికారులపై చర్యలకు తల్లిదండ్రుల డిమాండ్
పాట్నా: సూర్యప్రతాపంతో బిహార్ లో 24 గంటల్లోనే 14మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. పాట్నా, గయా, నలంద, షేక్ పూరా, నవాడా, బెగుసరాయ్, లఖిసరాయ్, జెహనాబాద్ లలో వేర్వేరు ప్రాంతాలలో బుధవారం ఒక్కరోజే మరణాలు సంభవించాయని గురువారం మీడియాకు అధికారులు వివరించార. ఆయా ప్రాంతాల్లో 44 నుంచి 50 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ ప్రాంతాల్లో 337 మంది అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. వడదెబ్బతో వీరిలో 14మంది ప్రాణాలు విడిచారని తెలిపారు. మరోవైపు ఆయా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల తరువాత బయటికి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏసీలు, ఫ్రిడ్జీలు లాంటివి నిరంతరం నడపకూడదని అధికారులు ఆదేశించారు. విద్యుత్ డిమాండ్ పెరగడమే గాక వాటి వేడి బయటివాతావరణంలో కలిసి మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. కాగా బిహార్ లోని పాఠశాల విద్యార్థులు బుధవారం సోమ్మసిల్లి పడిపోవడం పట్ల విద్యాశాఖాధికారులపై తీవ్ర విమర్శలొచ్చాయి. వారేమో ఏసీ గదుల్లో కూర్చొని విద్యార్థులను ఎండల్లో మాడనిస్తున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణాలకు అధికారులు కూడా కారణమని వారిపై హత్య కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.