అప్రమత్తంగా ఉండాలి
విస్తరిస్తున్న యానిమేషన్ రంగం
85 దేశాలకు స్వదేశీకరణ ఆయుధాల ఎగుమతులు
పటేల్, బిర్సాముండా సేవలు ఎనలేనివి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: డిజిటల్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమాయక ప్రజలు వీరి బారిన పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరి పనిపట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోదీ వివరించారు. మోసపూరిత కాల్స్ వస్తే భయపడవద్దన్నారు. యానిమేషన్ రంగంలో భారత్ నూతన విప్లవానికి నాందీ పలుకుతుందన్నారు. ‘ఛోటా భీమ్, ధోలక్‌పూర్ కా ధోల్, కృష్ణ, హనుమాన్, మోటు-పట్లు’ వంటి ఇతర యానిమేషన్ సీరియల్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన ఆయుధాలను భారత్ 85 దేశాలకు ఎగుమతులు చేస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్, బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను జరుపుకోనున్నట్లు మోదీ ప్రకటించారు. వీరి సేవలను ఎనలేనివన్నారు.
ఆదివారం 115వ మన్ కీ బాత్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం ద్వారా భారత్ కు సందేశాన్ని వినిపించారు.
భయాందోళనలొద్దు..
డిజిటల్ మోసాలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి భయాందోళనలు అక్కరలేదన్నారు. ప్రభుత్వం ఈ రకమైన మోసాలను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపడుతుందన్నారు. వేధింపులు ఎక్కువైతే, మోసపోతే సైబర్ క్రైమ్, 1930లకు ఫిర్యాదు చేయాలన్నారు. దర్యాప్తు సంస్థలు, పోలీసులు ఇలా ఎన్నో రకాల పేర్లతో ప్రజలను డిజిటల్ మాధ్యమం ద్వారా కొందరు దోచుకునే ఎత్తుగడను సమిష్ఠిగా తిప్పికొట్టాలన్నారు. భద్రతకు మూడు చర్యలను చేపట్టాలని ప్రధాని ప్రజలను కోరారు. 1. ఆగండి 2. ఆలోచించండి 3. చర్య తీసుకోండి. అనే దశలను పాటించాలన్నారు. ఈ మూడు దశలను మిమ్మల్ని కాపాడతాయన్నారు. వ్యక్తిగత సమాచారం ఎవ్వరికీ ఇవ్వవద్దన్నారు. వీలైతే స్ర్కీన్ షాట్ ద్వారా సంభాషణ రికార్డు చేయాలన్నారు. సాక్ష్యాలను భద్రపరచాలన్నారు. ఇలాంటి మోసగాళ్ల సిమ్ లు, బ్యాంకు ఖాతాలు కూడా ఇప్పటికే బ్లాక్ చేశామన్నారు. సైబర్ మోసాలకు వ్యతిరేకంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులకు అవగాహనలో భాగస్వామ్యం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
భారత్ ను గ్లోబల్ యానిమేషన్ పవర్ హౌస్ గా మార్చేందుకు ప్రజలు కూడా సంకల్పించాలన్నారు. ఇందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. భారత సంస్కృతి, సాంప్రదాయాలకు చెందిన అనేక గాథలు, కథనాలు యానిమేషన్ సీరియల్ మాధ్యమంగా ప్రసారం అవుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం సంతోషకరన్నారు.
విస్తరిస్తున్న గేమింగ్ స్పేస్ రంగం..
గేమింగ్ స్పేస్ రంగం కూడా వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ఆటలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్నాయని తెలిపారు. ఈ సమయంలో యువత భారత కంటెంట్ ను సృష్టిస్తూ అద్భుతాలు సాధిస్తున్నారని కొనియాడారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందినట్లే గేమింగ్ స్పేస్ రంగం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందుకోసం యానిమేటర్లతోపాటు కథనం, రచయితలు, వాయిస్ ఓవర్ నిపుణులు, సంగీతకారులు, గేమ్ డెవలపర్లు, వీఆర్, ఏఆర్ నిపుణుల కోసం డిమాండ్ నిరంతరం పెరుగుతోందని తెలిపారు. ఈ రంగం మరింత విస్తరించేందుకు సృజనాత్మకత అవసరమన్నారు.
వోకల్ ఫర్ లోకల్ తో దీపావళి షాపింగ్ చేయాలి..
ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా అంతరిక్ష రంగం అద్భుతాలను సృష్టిస్తోందన్నారు. చంద్రుని దక్షిణ ధృవంలో ప్రపంచంలోనే తొలిసారిగా భారత్ అడుగిందని తెలిపారు. లడఖ్ లో ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్ ను ఏర్పాటు చేశామన్నారు. ఇవన్ని ప్రయోగాలు పూర్తి దేశీయ పరిజ్ఞానంతోనే ‘మేక్ ఇన్ ఇండియా’ జరిగాయన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా రక్షణ పరికరాలను 85 దేశాలకు భారత్ ఎగుమతులు చేస్తుందని తెలిపారు. ఆవిష్కరణలు, విజయాలు వంటివి సోషల్ మీడియాలో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దీపావళి పండుగ సందర్భంగా వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం ద్వారా షాపింగ్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఐక్యతే వీరి లక్ష్యం..
సర్దార్ పటేల్, బిర్సాముండాల సేవలను కొనియాడారు. వీరి దూరదృష్టి గొప్పదన్నారు. 150 వ బిర్సాముండా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామన్నారు. వీరిద్దరూ వేర్వేరు సవాళ్లను ఎదుర్కున్నా వీరి దారు వేరైనా వీరి లక్ష్యం ఒక్కటేనని అదే దేశ ఐక్యత అని ప్రధాని మోదీ తెలిపారు. మహాత్మాగాంధీ, వివేకానంద జయంతుల సందర్భంగా వారి జీవిత చరిత్రను తెలుసుకొని ప్రపంచవాసులు ఎలా స్ఫూర్తి పొందుతారో అలాగే వీరిద్దరి జీవితాల ద్వారా కూడా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు.
విదేశాల్లోనూ దేశ సంస్కృతి, సాంప్రదాయాలపై ప్రదర్శనలు హర్షం..
అనంత్ నాగ్ ఫిర్దౌసా బషీర్, ఉదంపూర్ గోరీనాథ్, తెలంగాణ డి. వైకుంఠం, నారాయణ్ పూర్ బుట్లూరామ్ లు తమ తమ ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడంలో తీవ్ర కృషి చేశారని కొనియాడారు. రష్యాలో కాళిదాసు అభిజ్ఞాన శాంకుతల, లావోస్ లో రామాయణం ఆఫ్ లావోస్, కువైట్ లో అబ్దుల్లా అల్ బరూన్ రామాయణం, మహాభారతాలు, పెరూ ఎర్లిండా గార్సియా లాంటి భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలు విస్తరించడం, ప్రదర్శించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని మోదీ పిలుపునిచ్చారు.
ఫిట్ నెస్, యోగాపై ప్రజలకు అవగాహన పెరగడం, సోషల్ మాధ్యమంగా ఈ కార్యకలాపాలను పంచుకోవాలన్నారు. సర్దార్ పటేల్ జయంతి, దీపావలి 31నే వస్తున్నాయని తెలిపారు. అందుకే 29వ తేదీన రన్ ఫర్ యూనిటీ నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే పండుగలు, ధంతేరస్, దీపావళి, ఛత్ పూజ, గురునానక్ జయంతిపై ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.