నా తెలంగాణ, మెదక్: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో ఉత్సవాలపై పోలీసు, రెవెన్యూ, పంచాయితీ, విద్యుత్, మున్సిపాల్టీ, మత్స్యశాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను భక్తులు వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. దీంతో పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ఉత్సవాల సమయంలో ప్రథమ చికిత్స కోసం అంబులెన్సులను సిద్ధం చేసుకోవాలన్నారు. మండపాల వద్ద అగ్నిప్రమాదాలపై అగ్నిమాపక శాఖ అవగాహన కల్పించాలన్నారు.
వినాయక నిమజ్జనానికి కమిటీలతో సమన్వయం చేసుకొని శాంతియుతంగా ఉత్సవాలు ముగిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో వాగులు, వంకలు, చెరువుల వద్ద పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు నిర్వహించాలని తెలిపారు. మండపాల వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద పారిశుద్ధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం రోజు మంచినీటిని అందించాలన్నారు. మత్స్యశాఖ నిమజ్జనం సమయంలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాలకు విద్యుత్ శాఖ అనుమతులు జారీ చేయాలని విద్యుత్ తీగలు, స్తంభాల వద్ద మండపాలను ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నిమజ్జనం జరిగే చోట క్రేన్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఉత్సవాలలో తావీయరాదని శాంతియుతంగా, వైభవంగా ఉత్సవాలను పూర్తి చేయడంలో అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మట్టి వినాకులతో కూడి పోస్టర్ ను జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మట్టి వినాయకులను నెలకొల్పి పూజించడం తో పర్యావరణానికి మేలు అనే నినాదంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్, మెదక్ ఆర్డీవో రమాదేవి, తూఫ్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి, సంబంధిత పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, మునిసిపల్, పంచాయతీ, సంబంధిత శాఖల అధికారులు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.