కుటుంబ, బంధుప్రీతి ఆరోపణల ఖండన
మీడియాతో రాజ్ నాథ్ సింగ్ కుమారుడికి సైతం టికెట్ ఇవ్వలేదని వెల్లడించిన మంత్రి
న్యూఢిల్లీ: కుటుంబ రాజకీయాలు బంధు ప్రీతి ఆరోపణలను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. తన కుమారుడు పంకజ్ సింగ్ కు కూడా టికెట్ ఇచ్చేందుకు నిరాకరించానని స్పష్టం చేశారు. గురువారం మీడియా సదస్సులో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. తాను కుటుంబవాద రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. 2007 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను అధ్యక్షుడిగా ఉన్నానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్, ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా తన వద్దకు వచ్చి కుమారుడు పంకజ్ సింగ్ ను వారణాసి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని సూచించారని అన్నారు. కానీ అందుకు నిరాకరించానని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ అద్వానీలు కూడా ఈ విషయంలో టికెట్ ఇవ్వమని తెలిపారని పేర్కొన్నారు. కానీ తాను టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పానని వివరించారు. తన కుమారుడు పంకజ్ తనతో విబేధించాడని తెలిపారు.
అప్పుడు తన కుమారుడికి అర్థమయ్యే రీతిలో వివరించానని తెలిపారు. ఒక కుటుంబం పెద్ద పార్టీని నడుపుతున్నప్పుడు ఆ కుటుంబంలోని వ్యక్తి ప్రజాసేవలో ఏ మేరకు అంకితమయ్యారనేది ముఖ్యమని తెలిపానని చెప్పారు. ఒకవేళ ఆ వ్యక్తి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రజాసేవకు అంకితమైతే టికెట్ ఇచ్చేందుకు ఎవ్వరైనా వెనుకాడరని తెలిపారు. ఒకే కుటుంబంలో 8, 9 మంది నాయకులున్నా వారు ఏ మేరకు దేశసేవలో అంకితమయ్యారనేది ముఖ్యమని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. వారంతా క్రియాశీలకంగా ఉంటూ, దేశ, ప్రజాసేవలో ఉంటే వారికి ప్రజామోదం లభిస్తుందని స్పష్టం చేశారు. అప్పుడు పార్టీ అధిష్ఠానాలు కూడా ఆ వ్యక్తినే ఎన్నుకుంటాయని స్పష్టం చేశానని తెలిపారు.
కుటుంబ వాద రాజకీయాలపై రాజ్ నాథ్ సింగ్ పై కాంగ్రెస్ పలు ఆరోపణలు సంధించింది. ఈ నేపథ్యంలో మంత్రి ఆరోపణలు ఖండిస్తూ ఆయా విషయాలను తెలిపారు.
రాజ్ నాథ్ సింగ్ కుమారుడు ప్రస్తుతం యూపీలోని నోయిడా నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.