అమేథీ, రాయ్ బరేలీ అభ్యర్థుల ఎంపికపై హస్తంలో కొనసాగుతున్న సస్పెన్షన్
బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపిన కమలం పునరాలోచనలో హస్తం అధిష్ఠానం
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని అమేథీ, రాయ్ బరేలీ స్థానం అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ లో సస్పెన్షన్ కొనసాగుతోంది. గురువారం రాత్రి వరకూ సస్పెన్షన్ వీడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపినప్పటికీ ఇక్కడి నుంచి బీజేపీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడంతో హస్తంలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది.
అమేథీ నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలోని కమిటీ భావించింది. కాగా ఈ స్థానం నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (మహిళ)ని ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపి కాంగ్రెస్ ఆలోచనలకు చెక్ పెట్టింది. మరోవైపు రాయ్ బరేలీ స్థానం నుంచి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగనున్నారనే టాక్ కొనసాగినా ఇక్కడి నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని ఎమ్మెల్సీ దినేష్ ప్రతాప్ సింగ్ పంచవటి ప్రాబల్యానికి చెందిన వ్యక్తిని దింపి ఈ స్థానం నుంచి కూడా హస్తానికి చెమటలు పట్టించింది.
దీంతో అధిష్టానం మరోసారి పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచే ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లుగా సాయంత్రం ప్రకటిస్తారని చెప్పుకున్నా రాత్రి పొద్దుపోయే వరకూ కూడా ప్రకటించకపోవడం విశేషం. ఏది ఏమైనా ఈ రెండు స్థానాల్లో కమలదళం తమ సత్తాచాటనుందనే వాదన వినిపిస్తోంది. మరీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాల నుంచి రాహుల్, ప్రియాంకలను బరిలోకి దింపుతుందా? లేదా వేరే ఏదైనా ఇతర ప్రాంతం నుంచి రంగంలోకి దింపుతుందా అనే సంశయం కొనసాగుతోంది.