Kavitha: కవితకు మళ్లీ షాక్
Delhi Court denies bail to BRS leader K Kavitha in liquor 'scam' case
- బెయిల్ నిరాకరించిన కోర్టు
- రెండు కేసుల్లోనూ చుక్కెదురు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ షాక్ తగిలింది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కవిత.. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని ఆమె కోర్టును కోరారు. మహిళగా పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందని పేర్కొన్నారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆమె సూత్రధారి!
ఇటీవల విచారణ సందర్భంగా కవితతో పాటు ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్ చేశారని కవిత తరఫు న్యాయవాది వాదించారు. ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ అరెస్ట్ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ పార్టీకి కవిత స్టార్ క్యాంపెయినర్ అని చెప్పారు. కాగా ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ, ఈడీ తరఫున న్యాయవాది కోర్టును కోరారు. దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలుగుతారన్నారు. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారని.. సూత్రధారి, పాత్రధారి ఆమేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవితకు బెయిల్ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.