రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తుల పెంపు
నేటి నుంచి రెండు రోజులపాటు భాగస్వాములతో సమావేశాలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తుల రూపకల్పనలో పెరుగుదలకు, సాంకేతికత, నాణ్యతతో కూడిన ఉత్పత్తులను మరింత పెంచేందుకు రక్షణ శాఖ నడుం బిగించింది. 4, 5 తేదీల్లో రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మిలటరీ హెడ్ క్వార్టర్లలో వాటాదారులు, డిఫెన్స్ ఇండస్ట్రీ ప్రతినిధులు, రక్షణ రంగ ఉత్పత్తులను అందజేస్తున్న ప్రైవేట్ భాగస్వాములతో సమావేశం నిర్వహించనుంది. రక్షణ శాఖ ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రకటన ప్రకారం.. ఆర్మీ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. కార్యదర్శి కీలకోపన్యాసం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయుధాల వినియోగం, ఆర్మీకి అందించే వస్ర్తాలు తదితర సౌకర్యాలపై భాగస్వాములతో చర్చలు జరపనున్నారు. రక్షణ రంగానికి ఈసారి ప్రధాని మోదీ ప్రభుత్వం రూ. 6,21,541 కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ ఉత్పత్తులను పెంచేందుకు మరింత ప్రోత్సాహం లభించనుంది.