ముంబాయి బస్సు ప్రమాదం ఏడుకు పెరిగిన మృతులు
36మందికి తీవ్ర గాయాలు
ముంబాయి: ముంబాయిలో సోమవారం రాత్రి జరిగిన బెస్ట్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. మరో 36 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు మంగళవారం మీడియాకు తెలిపారు. బెస్ట్ బస్సు కుర్లా నుంచి అంధేరికి వెళుతుండగా కుర్లా స్టేషన్ రోడ్డులో అదుపు తప్పింది. దీంతో వేగంగా వెళుతూ 40 వాహనాలను ఢీకొట్టింది. అనంతరం స్థానికులు డ్రైవర్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో బస్సు డ్రైవర్ మినీ డ్రైవర్ అని తేలింది. అదను ఇంతవరకు హెవీ బస్సును నడపలేదన్నారు. దీనిపై విచారణ చేపట్టామన్నారు. కుర్లా రైల్వే స్టేషన్ రోడ్డు అంబేద్కర్ నగర్ వద్ద సోమవారం రాత్రి బస్సు అదుపు తప్పిందన్నారు. ఈ బస్సును బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్వహిస్తుందన్నారు. నిందితుడు సంజయ్ మోరేగా గుర్తించామన్నారు. డిసెంబర్ 1 నుంచి కాంట్రాక్ట్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు నిందితుడు తెలిపాడన్నారు. బ్రేక్ కు బదులుగా యాక్సిలేటర్ ను నొక్కడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రమాదంతో స్థానికంగా భీతావాహ వాతావరణం నెలకొంది. అంబేద్కర్ నగర్ రోడ్డు మొత్తం ఎక్కడ చూసినా వాహనాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ప్రమాదానికి బీఎంసీ అధికారులే కారణమని మృతిచెందిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.