సైబర్​ ఉచ్చు.. లావోస్​ నుంచి 13 మంది సురక్షితంగా తరలింపు

కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ కృషికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు

Jul 21, 2024 - 12:35
 0
సైబర్​ ఉచ్చు.. లావోస్​ నుంచి 13 మంది సురక్షితంగా తరలింపు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఉద్యోగాల ముసుగులో సైబర్​ ఉచ్చులో చిక్కుకొని లావోస్​ లో తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న 13 మందిని ఆదివారం సురక్షితంగా భారత్​ కు తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ నేతృత్వంలో లావోస్​ విదేశాంగ శాఖ, ప్రభుత్వంతో పలుమార్లు చర్చల అనంతరం ఈ 13మందిని సురక్షితంగా తీసుకురాగలిగారు. ఇప్పటివరకూ విదేశాంగ శాఖ 518మంది భారతీయులను విదేశాలనుంచి సురక్షితంగా తీసుకువచ్చిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

పలువురు మోసపూరిత ఏజెంట్ల ప్రకటనలను నమ్మిన వీరంతా ఉద్యోగ వేటలో లావోస్​ కు వెళ్లారు. అక్కడకు వెళ్లాక స్థానిక ఏజెంట్ల ఉచ్చులో చిక్కుకున్నారు. వీరిని  సైబర్​ స్కామ్​ కు పాల్పడాలని బెదిరింపులకు గురి చేస్తున్నారు. 13మంది సోషల్​ మీడియా మాధ్యమంగా తమ ఆవేదనను వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. వీరి ఆచూకీపై లావోస్​ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. భారతీయులను ఉద్యోగం పేరుతో మోసం చేసే ఇలాంటి స్థానిక మోసగాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే వీరిని మోసం చేసిన భారతీయ ఏజెంట్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 

ఎట్టకేలకు 13మందిని భారత్​ కు తీసుకురావడంపై ఆయా కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ తీసుకున్న చర్యలపై ఆయా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.