ఐక్యతను దెబ్బతీస్తారా? దేశాన్ని ముక్కలు చేస్తారా?
కచ్చతీవును దూరం ఇచ్చేస్తారా? మత్స్యకారులను నష్టపరుస్తారా? మీరట్ఎన్నికల సభలో కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీలను తూర్పార బట్టిన ప్రధాని మోదీ
మీరట్: కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముక్కలు చేసే పని చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కూటమిని ఏర్పాటు చేసి అవినీతిమయమైన పార్టీలతో చేతులు కలిపి దేశ ఐక్యతను దెబ్బతీస్తోందన్నారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను, కీర్తి,ప్రతిష్ఠలను కాపాడలేని చేతగాని పార్టీల వల్ల దేశానికి నష్టం వాటిల్లుతోందని అలాంటి పార్టీలకు ఓటు వేస్తే ప్రజల మాన, ధన, ప్రాణాలను కాపాడలేరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలంతా ఒక్కసారి ఆలోచించుకోని భారతదేశ హితం కోసం ఎవ్వరైతే ఆలోచిస్తున్నారో ఆ పార్టీకి (బీజేపీ)కి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ఆదివారం మీరట్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. 2014, 2019లో కూడా ప్రధానమంత్రి మీరట్ వేదికగానే ఎన్నికల తొలి ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. తాము అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ, కూటమి నేతల ఒంట్లో వణుకు పుడుతోందన్నారు. అవినీతిని రూపుమాపాలని మోదీ అంటుంటే, ఇండి కూటమి పార్టీలు అవినీతి పార్టీలను రక్షించాలని కుటీల రాజకీయాలకు తెరతీస్తున్నారని పేర్కొన్నారు. ఇండికూటమితో ప్రధాని మోదీ భయపడేవాడు కాదని, దేశ ప్రజాహితం కోసం నిరంతరం శ్రమిస్తానని, దేశ ప్రజలే తన కుటుంబం అని అన్నారు. తన దేశాన్ని అవినీతిమయం కాకుండా కాపాడాలనేదే తన ఉద్దేశ్యమన్నారు. పెద్దపెద్ద అవినీతిపరులు కూడా ఈ రోజు ఊచలు లెక్కపెడుతున్నారన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూడా బెయిల్ లభించడం లేదన్నారు. ఎంతోమంది అవినీతిపరులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నాని పేర్కొన్నారు. అవినీతి డబ్బును గోడలు, పరుపులు, వాషింగ్ మెషిన్లు, మంచాలు, విద్యుత్ లైట్లు, టీవీలు, ఫ్రీడ్జీలలో కట్టలు కట్టలుగా నోట్లు బయట పడుతున్నాయని అన్నారు. ఇదంతా భారతదేశ సంపద అని, నిరుపేదల సంపద అని ప్రధాని స్పష్టం చేశారు. అవినీతి ద్వారా వచ్చిన సంపదను ఎవ్వరి సంపద వారికి తిరిగి ఇచ్చేస్తామని ప్రధాని మోదీ గ్యారంటీ అని పేర్కొన్నారు. అవినీతిపరుల ఆస్థులను జప్తు చేశామని ఆ సంపత్తి విలువ రూ. 17వేల కోట్లకు పైగా ఉంటుందని అన్నారు. మీరట్లాంటి వీరభూమి నుంచి అవినీతి పరులు చెవులు తెరుచుకొని వినాలని మోదీపై ఎన్ని విమర్శలు చేసిన మోదీ ఆగేవాడు కాదని అన్నారు. అవినీతిపరులు ఎంతపెద్ద స్థానంలో ఉన్న వారైనా వారిపై చర్యలుంటాయని, దేశాన్ని దోచుకుతిన్న వారు తిన్నదంతా కక్కిస్తానని అదే మోదీ గ్యారంటీ అని ప్రధాని పేర్కొన్నారు. మీరట్ వీర్ మంగళ్‌పాండే కర్మభూమి అని, వంశీ కొత్వాల్‌లు పుట్టిన నేల అని అన్నారు. కాంగ్రెస్, ఇండి కూటమి దేశ ఐక్యత ఎలా విచ్చిన్నం చేస్తున్నాయో ప్రజలు చూస్తున్నారని అన్నారు. దేశ విరోధ విషయం తనకు ఈ రోజే తెలిసిందన్నారు. కచ్చతీవు ద్వీపం భద్రత పరంగా భారత్‌కు అత్యంత ఉపయోగమైందని అన్నారు. దేశం స్వాతంత్ర్యం సాధించాక మనవద్దే ఉండేదని, కానీ కాంగ్రెస్ పార్టీ నాలుగైదు దశాబ్ధాల క్రితం శ్రీలంకతో ఈ ద్వీపం ఉపయోగ పడదని, పనికిరాదని భారతదేశ ఒక అంగాన్ని దూరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఆ ద్వీపం గుండా మత్స్యకారులు వెళుతుంటే అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీలు దేశానికి, మనకు అవసరమా? అని ప్రధాని ప్రశ్నించారు.
ఉద్యోగాల్లో రెండింతలు మహిళల సంఖ్య పెరిగిందన్నారు. ముద్ర రుణాల ద్వారా పదేళ్లలో 10 కోట్ల మంది సహాయక సంఘాలతో మమేకమయ్యారని మోదీ స్పష్టం చేశారు. దీని ద్వారా గ్రామాల్లోని మహిళలు ఆర్థిక స్వావలంభన చేకూరుస్తున్నామని స్పష్టం చేశారు. 2029 వరకు మరో మూడు కోట్ల మందిని లక్పతీ దీదీలుగా తీర్చిదిద్దుతామని ప్రధాని తెలిపారు. నేడు ప్రతీ లబ్ధిదారుడికి నేరుగా కేంద్ర పథకాల ఫలితాలు లభించే ఏర్పాట్లు చేశామని వివరించారు.
తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని అన్నారు. చెఱకు రైతుల హితం కోసం తాము తీసుకున్న చర్యల వల్ల రైతులకు లాభం చేకూర్చామని తెలిపారు. చెఱకు రైతులకు ఆర్థికంగా మరింత లబ్ధి చేకూర్చేందుకు ఇథనాల్‌ను తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రయత్నంలో విజయం సాధించి ఇథనాల్తయారు చేసి రూ. 70వేల కోట్లు రైతులకు లబ్ధి చేకూర్చామని ప్రధాని పేర్కొన్నారు.
మీరట్ వాసులు పీఎం సూర్యఘర్ యోజనను వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీని ద్వారా విద్యుత్ ఉచితంగా అందుతుందన్నారు. రూ. 75వేల రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుందని స్పష్టం చేశారు. దేశంలోని మొదటి నమోభారత్ రైల్ కారిడార్ ఢిల్లీ నుంచి మీరట్‌కు ఏర్పాటు చేశామన్నారు. మీరట్ మెట్రో పనులు కూడా జరుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు. మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. మీరట్‌ను ఎడ్యూకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, అన్ని రంగాల్లో అభివృద్ధితో యువకుల కోసం నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని స్పష్టం చేశారు.