బీజేపీకి 400 స్థానాలు ఖాయం పీవోకే భారత్​ లో అంతర్భాగమే

ప్రజాస్వామ్యం గొంతునొక్కుతున్న కాంగ్రెస్​  ఎమర్జెన్సీ సమయంలో తల్లి అంత్యక్రియలకు కూడా అనుమతించలేదని ఆవేదన మీడియాతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​

May 20, 2024 - 12:51
 0
బీజేపీకి 400 స్థానాలు ఖాయం పీవోకే భారత్​ లో అంతర్భాగమే

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: బీజేపీకి 400 సీట్లు వస్తే పీవోకే భారత్​ లో అంతర్భాగం కానుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ అన్నారు. కాంగ్రెస్​ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భారత్​ లో అభివృద్ధిని చూసి పలు దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయన్నారు. మోదీ నేతృత్వంలో భారత్​ బలమైన నిర్ణయాలను తీసుకుంటూ ఆర్థిక, సామాజిక సుస్థిరతను సాధిస్తుందని మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు. 

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో మంచి పాలన అందిస్తున్న ఏకైక పార్టీ బీజేపీదే అన్నారు. అందుకే తమ లక్ష్యం కూడా పెద్దగానే ఉంటుందన్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం కనెక్టివిటినీ మెరుగుపరిచి నిరుపేద గ్రామాల్లో సైతం రోడ్లు, విద్యుత్​, నీరు, విద్య, వైద్యం లాంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు ఈ సౌకర్యాలన్నీ ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్​, కూటమి పార్టీలు దేశ వ్యతిరేక శక్తులకు మద్దతునీయడం శోచనీయమన్నారు. ఎన్నికల తరువాత వీరి ఆట పూర్తిగా కట్టిస్తామన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను వదలబోమని మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ సమయంలో తన తల్లి దహన సంస్కారాలకు వెళ్లేందుకు కూడా తనను అనుమతించలేదని అంత నీచమైన పార్టీ కాంగ్రెస్​ పార్టీ అని మండిపడ్డారు. 

పీవోకే ఎప్పటికీ భారత్​ లో అంతర్భాగమే అని పేర్కొన్నారు. భారత్​ అభివృద్ధిని చూసి పీవోకేలోని ప్రజలు స్వచ్ఛందంగా భారత్​ తో కలవాలని ఆందోళనలు చేస్తుండడం అందరూ చూస్తున్నారని అన్నారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని నిరంతరం ఎదుర్కొని అనేక కష్టనష్టాలకు గురైన భారత్​ మోదీ హయాంలో కొత్త రణనీతిని అవలంబిస్తోందన్నారు. దీని వల్ల ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలించామని వారిని ఎగదేసే దేశానికి గుణపాఠం చెప్పగలిగామన్నారు. అంతర్జాతీయ సమాజంలో ఆ దేశం ఇప్పుడు ఏకాకీలా మారిందన్నారు. కనీసం తిండిగింజల కోసం కూడా అడుక్కునే స్థాయిలో ఉందన్నారు. అయినా తిండిగింజలు కూడా దొరకడం లేదని విమర్శించారు. 

రాజ్​ నాథ్​ సింగ్​..

రాజ్​ నాథ్​ సింగ్​ (72). 1977లో మీర్జాపూర్​ స్థానం నుంచి జనసంఘ్​ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో బీజేపీలో చేరారు. 1991లో ఉత్తరప్రదేశ్​ విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు. 2000–2002 వరకు యూపీకి ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2005 నుంచి 2009 వరకు బీజేపీ జాతీయాధ్యక్షులుగా ఉన్నారు. 2009లో యూపీ ఘజియాబాద్​ ఎంపీగా ఎన్నికయ్యారు. 2013–2014 వరకు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. 2014లో యూపీ లక్నో ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లోనే ఆయనకు మోదీ ప్రభుత్వం హోంశాఖ మంత్రిగా నియమించింది. 2019లో లక్నో ఎంపీగా మరోమారు ఎన్నికయ్యారు. 2019లో మోదీ ప్రభుత్వం రాజ్​ నాథ్​ సింగ్​ ను రక్షణ శాఖ మంత్రిగా నియమించారు.