కోయకుండానే కూర‘గాయాలు’
Curry 'wounds' without cutting
బెంబేలెత్తుతున్న ప్రజలు
భారీ వర్షాలు, వరదలతో కూరగాయల పంటలకు నష్టం
ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవి రాకపోవడంతో ధరల్లో పెరుగుదల
నా తెలంగాణ, మెదక్: భారీ వర్షాలు, వరదలతో కూరగాయల ధరలు కొండెక్కాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు జిల్లా వాసులను భయపెడుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు వీటిని కొనాలంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో మెదక్ జిల్లాకు రంగారెడ్డి, వికారాబాద్, మహాబూబ్ నగర్ కు చెందిన రైతులు కూడా కూరగాయలను తీసుకువచ్చి విక్రయిస్తుండడంతో ధరల తగ్గుదల కనిపించేది. ప్రస్తుతం భారీ వరదలు, వర్షాలతో భారీ సంఖ్యలో రైతులు నష్టపోవడంతో ఉన్న కొద్ది పంటను తమ సమీప ప్రాంతంలోనే అమ్ముకుంటున్నారు. దీంతో మెదక్ జిల్లాకు తీవ్ర కూరగాయల కొరత ఏర్పడింది. మరోవైపు ప్రభుత్వం వద్ద ఆశించిన స్థాయిలో కూరగాయలను నిల్వ చేసే సామర్థ్యం లేదు. ప్రైవేటు ఏజెంట్లు కూరగాయాలను నిల్వచేసే సామర్థ్యం కలిగి ఉన్నారు. దీంతో వారు నిర్ధారించే ధర అన్నట్లుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ధరలు భారీగా పెరిగాయని కూరగాయలను అమ్మే దుకాణదారులు చెబుతున్నారు. ఏది ఏమైనా కోయకుండానే కూర‘గాయాల’వుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కూరగాయల ధరలు..
టమాట కిలో రూ. 30, వంకాయ రూ. 80, బెండకాయ రూ. 100, పచ్చిమిర్చి రూ. 80, కాకరకాయ రూ. 80, బీరకాయ రూ. 100, క్యాలీఫ్లవర్ రూ. 80, క్యాబేజీ రూ. 80, క్యారెట్ రూ. 80, దొండకాయ రూ. 90, ఆలుగడ్డ రూ. 65, గోకరకాయ రూ. 80, దోసకాయ రూ. 80, సొరకాయ రూ. 80, పొట్లకాయ రూ. 40, చిక్కుడుకాయ రూ. 120, ఆర్వి రూ. 80, చిలుకూరు దుంప రూ. 80, బీట్రూట్ రూ. 60, కీర రూ. 60, బీన్స్ రూ. 100, క్యాప్సికం రూ. 40లుగా ఉన్నాయి.