నా తెలంగాణ, మెదక్: కేసుల్లో ఇరికి కోర్టు, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరిగితే నష్టమే తప్ప లాభం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. మెదక్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద ప్రసంగించారు. లోక్ అదాలత్ లో పెద్దఎత్తున కేసులు పరిష్కారం అయ్యాయి.
ద్వేష భావాలను తగ్గించుకొని కేసుల్లో రాజీ మార్గాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అన్నారు. దాంతో విలువైన సమయం, డబ్బు దుర్వినియోగం కాదని అన్నారు. చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకొని పంతాలకు పోయి కేసుల్లో ఇరికితే పోలీస్ స్టేషన్లు, కోర్టులకు ఎక్కితే నష్టమే తప్ప లాభం ఉండదని న్యాయమూర్తి శారద పేర్కొన్నారు.
ఈ లోక్ అదాలత్ లో 3034 కేసులు రాజీ కుదిర్చారు. ఇందుకుగాను రూ. 76,13,000లను రికవరీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముందు న్యాయమూర్తి శారద, సీనియర్ సివిల్ న్యాయమూర్తి సిహెచ్ జితేంద్ర, జూనియర్ సివిల్ న్యాయమూర్తి రీటా లాల్ చంద్ లతో పాటు కోర్టు సిబ్బంది, న్యాయవాదులు స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొని కోర్టు ఆవరణను శుభ్రపరిచారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాష్ చంద్ర గౌడ్, న్యాయవాదులు, పోలీస్, కక్షిదారులు పాల్గొన్నారు.