క్రిప్టో డేంజరే!
ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
వాషింగ్టన్ డీసీ: ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టో కరెన్సీ భారీ ప్రమాదాన్ని తీసుకువచ్చే అవకాశం ఉందని, ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థలూ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. శనివారం అమెరికా వాషింగ్టన్ డీసీలో పీఐఐఈ నిర్వహించిన మాక్రో వీక్–2024లో శక్తికాంతదాస్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. దీంతో సెంట్రల్ బ్యాంక్ నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థపై క్రిప్టో కరెన్సీ ఆధిపత్యం చెలాయించేందుకు అనుమతించవద్దని తాను భావిస్తున్నట్లు దాస్ తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పు అన్నారు. బ్యాంకులు నియంత్రణ కోల్పోతే, సాంకేతికంగా నగదు ఎలా తనిఖీ చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు. సంక్షోభ సమయాల్లో ద్రవ్య సరఫరాను నియంత్రించడం ద్వారానే సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుందని అన్నారు. తమ దృష్టిలో క్రిప్టో కరెన్సీ పెద్ద ప్రమాదమే అని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు.