మీరు దేశం పేరును నిలబెట్టారు

You have upheld the name of the nation

Jul 29, 2024 - 00:24
 0
మీరు దేశం పేరును నిలబెట్టారు
– మనుబాకర్​ తో ప్రధాని
– కాంస్యం ఆనందం, ఉత్సాహాన్నిచ్చింది 
– ఫోన్​ లో మాట్లాడిన నరేంద్ర మోదీ 
నా తెలంగాణ, శాతోవు(ఫ్రాన్స్​):  ‘మీరు దేశం పేరును నిలబెట్టారు. కాంస్యం సాధించడమే కాకుండా షూటింగ్​ లో పతకం తెచ్చిన తొలి భారత మహిళగ చరిత్ర లిఖించారు.’ అంటూ ప్రధాని మోదీ.. ఒలింపిక్​ కాంస్య విజేత మనుబాకర్​ ను ప్రశంసలతో ముంచెత్తారు. మను పతకం అందుకున్నాక ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఫోన్​ చేసి అభినందించారు. మను బాకర్-మోదీ మధ్య ఫోన్ సంభాషణ సాగిందిలా...
మోదీ: మను.. నమస్తే. మీకు శుభాకాంక్షలు.
మను: థాంక్యూ సర్. ఎలా ఉన్నారు?
మోదీ: మీరు విజయం సాధించారన్న వార్త విన్న తర్వాత ఉత్సాహం, ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను.
మను: మన క్రీడాకారులు ఇక్కడ రాణిస్తున్నారు సర్.
మోదీ: రజతం చేజారినప్పటికీ.. మీరు మన దేశం పేరును నిలబెట్టారు. మీకు రెండు విధాలా క్రెడిట్ దక్కుతోంది. ఒకటి కాంస్యం సాధించడం. రెండు.. ఈ విభాగంలో పతకం తీసుకొచ్చిన తొలి మహిళ మీరే కావడం.
మను: ధన్యవాదాలు సర్..
మోదీ: టోక్యో ఒలింపిక్స్ సమయంలో మీకు పిస్టల్ హ్యాండిచ్చింది. కానీ, ఈసారి మాత్రం అన్ని లోపాలను అధిగమించారు.
మను: అవును సర్. ఇంకా మ్యాచ్​ లు ఉన్నాయి. వాటిలోనూ రాణించేందుకు ప్రయత్నిస్తా.
మోదీ: నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రారంభమే ఇంత బాగుంది. దాంతో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేశానికీ పేరు వస్తుంది. తోటి క్రీడాకారులు అందరూ సౌకర్యంగానే ఉన్నారా? అక్కడ అన్ని ఏర్పాట్లు సరిగ్గానే ఉన్నాయా?
మను: అవును సర్. అందరూ ఆనందంగా ఉన్నారు. మిమ్మల్ని కూడా గుర్తు చేస్తున్నారు.
మోదీ: మన క్రీడాకారులకు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేం కూడా అన్ని చర్యలు తీసుకున్నాం.
మను: అన్ని బాగున్నాయి సర్. మీ ప్రయత్నాలు ఫలించాయనుకుంటా.
మోదీ: మీ అందరి శ్రమ ఫలిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడారా? మీ నాన్న రామ్ కిషన్ చాలా సంతోషిస్తున్నారు కావచ్చు.. ఆయన మిమ్మల్ని చాలా ప్రోత్సహించారు.
మను: అవును సర్. అందరూ సంతోషంగా ఉన్నారు. థాంక్యూ సర్.