పేదల విద్యపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కక్ష

కొమా స్థితిలో ఫీ రీయంబర్స్ మెంట్ దివాలా తీస్తున్న ప్రైవేటు కాలేజీలు 16 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి రూ. 7500 కోట్లు బకాయిలు రెండేండ్లుగా బకాయిలు చెల్లించని ప్రభుత్వం బెదిరించి కాలం గడిపిన బీఆర్ఎస్ సర్కార్ హామీ ఇచ్చి మాటే ఎత్తని సీఎం రేవంత్

Apr 30, 2024 - 17:12
 0
పేదల విద్యపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కక్ష
సగటు పేద, మధ్యతరగతి జీవుల ఆదాయంలో సగానికి పైగా ఖర్చయ్యేది విద్య, వైద్యం కోసమే.  విద్యా, వైద్యం విషయంలో  ప్రభుత్వం అనుసరించే వైఖరి వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. పిల్లల్ని ఉన్నత విద్యావంతులను చేయాలనే సంకల్పం అన్ని వర్గాల ప్రజల్లోనూ బలంగా ఉండే కోరిక. ప్రభుత్వరంగంలో నాణ్యమైన విద్య అందించడంలో విఫలమవడమో లేక అందరికీ విద్యనందించడంలో ప్రభుత్వ వ్యవస్థల శక్తి చాలకనో ప్రైవేటు విద్యారంగం బలోపేతమైంది. ప్రైవేటు విద్యను కూడా పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంచే ఉద్దేశంతో ప్రారంభమైన ఫీ రీయంబర్స్ మెంట్ పథకం లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపింది. బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలతో ఈ పథకం కోమాలోకి వెళ్లింది. ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఫలితంగా లక్షల మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. వందల సంఖ్యలో ప్రైవేటు విద్యా సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయి మూతపడనున్నాయి.
(నా తెలంగాణ, హైదరాబాద్):

 
 ప్రైవేటు విద్యాసంస్థలకు ఫీ రీయంబర్స్ మెంట్ అన్నది ఒక గొప్ప పథకం. విద్యా, వైద్యం ఉచితంగా కావాలని నినాదం చాలా కాలంగా భారతదేశ వ్యాప్తంగా వినిపిస్తున్నది. ఇందులో భాగంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రవేశపెట్టిన గొప్ప పథకాల్లో ఒకటి ఆరోగ్యశ్రీ, రెండవది  ఫీ రీయంబర్స్ మెంట్. అయితే ఈ పథకం ప్రవేశపెట్టిన మొదట్లో కొన్ని విమర్శలొచ్చాయి. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఫీ రీయంబర్స్ మెంట్ పథకము అమలు చేయడం ఏమిటి అని అధికారులే వ్యతిరేకించారు. కానీ అప్పటి ప్రభుత్వంలో ఉన్న మరికొందరు అధికారులు ఉన్నతంగా ఆలోచించిన ఫలితంగా ఈ పథకం ప్రారంభమైంది.  ప్రభుత్వం ఒక విద్యార్థి పైన ప్రతి సంవత్సరం సుమారు రూ. 1,20,000 ఖర్చు చేస్తున్నది. స్కూళ్ల నిర్మాణం మొదలు ఉపాధ్యాయుల నియామకం మొదలైనవన్నీ లెక్కిస్తే ఏటా ఒక విద్యార్థిపై అంత ఖర్చు చేయాల్సి వస్తున్నది. కానీ అదే ఒక ప్రైవేటు విద్యా సంస్థకు అందులో సగానికంటే తక్కువ మొత్తంలో ఆర్థికంగా సహకరిస్తే ఎక్కువ మందికి విద్యనందించే అవకాశం కలుగుతుందనేది కొందరు అధికారుల సలహా.  ఏటా సుమారు రూ.35 వేలతో ఉచిత విద్యను అందించవచ్చని అంచనా వేశారు. ప్రభుత్వం పైన ప్రభుత్వ విద్యా సంస్థల పైన భారాన్ని తగ్గించవచ్చన్న ఆలోచనతో ఫీ రీయంబర్స్ మెంట్ పథకానికి రూపకల్పన చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఈ పథకాన్ని విజయవంతంగా కొనసాగించారు. 
అక్రమాలు:
పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా సాగిన ఫీ రీయంబర్స్ మెంట్ పథకం కొన్ని కళాశాలల్లో జరిగిన అక్రమాలని దృష్టిలో పెట్టుకొని అప్పటి ప్రభుత్వాలు దీనికి కొన్ని సవరణలు చేసింది. స్టూడెంట్ కచ్చితంగా తన బయోమెట్రిక్ ని నమోదు చేసిన తర్వాతనే స్కాలర్ షిప్ గాని రీయంబర్స్ మెంట్ కానీ విడుదల అయ్యేటట్టుగా చేశారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో చాలామంది విద్యార్థులకు చదువుకోవడానికి ఒక వరంగా మారింది. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి విద్యార్థికి సరైన సమయానికి స్కాలర్ షిప్ రావడంతో పాటు ప్రతి కళాశాలకు ఆ విద్యాసంవత్సరం పూర్తయ్యేసరికి ఆ విద్యార్థులకు సంబంధించిన బకాయిలు చెల్లించేవారు. దీంతో ఆ విద్యాసంస్థలు విద్యార్థులకు మంచి నాణ్యతతో కూడిన విద్యను అందించగలిగారు. 
బీఆర్ఎస్ పాలనలో అస్తవ్యస్తం:
 
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి విద్యార్థుల ఫీ రీయంబర్స్ మెంట్ పథకానికి గ్రహణం పట్టింది. 2014లో పూర్తిగా రీయంబర్స్ మెంట్ ఆపేశారు. దీంతో చాలా ప్రైవేటు కాలేజీలు భవనాల కిరాయిలు కట్టలేక అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేక మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు కాలేజీల్లో పేద, మధ్యతరగతి విద్యార్థులను తప్పనిసరిగా చేర్చుకోవాలన్న ప్రభుత్వ వత్తిడి ఉండేది. అడ్మిషన్ ఇవ్వకుంటే కాలేజీ గుర్తింపు రద్దవుతుందేమోనన్న భయముండేది. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీ రీయంబర్స్ మెంటు ఇవ్వకపోవడంతో కాలేజీల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. చాలా సార్లు విద్యార్థులు, అధ్యాపకులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే వారిపై బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ప్రభుత్వం సకాలంలో ఫీ రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేక, విద్యార్థుల వద్ద ఫీజు అడగలేక యాజమాన్యాలు ఇబ్బంది పడ్డాయి. అధ్యాపకుల జీతాలు, భవన కిరాయి మొదలైన నిర్వహణ కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ పథకం ప్రారంభం కాక ముందు విద్యార్థులిచ్చే ఫీజులతో కాలేజీలు నడిపేవారు. ఫీ రీయంబర్స్ మెంట్ పథకం వచ్చాక విద్యార్థులెవరూ ఫీజులు చెల్లించడం మానేశారు. ప్రభుత్వమే  వారి తరపున ఇవ్వాల్సి ఉన్నా నిర్లక్ష్యంతో జాప్యం చేసింది. క్రమంగా కాలేజీల నిర్వహణ కోసం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రైవేటు కాలేజీలు పోరాట మార్గం ఎంచుకున్నది. విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి ఆందోళనకు దిగడంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం వారిపై కక్ష కట్టింది. టాస్క్ ఫోర్స్ బృందాలతో కాలేజీలపై దాడులకు దిగింది. కాలేజీ యాజమాన్యాలను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ పరిస్థితిలో అటు అప్పులు ఇటు అధికారుల వేధింపులు తట్టుకోలేక కొంతమంది కాలేజీ కరెస్పాండెంట్లు గుండెపోట్లకు గురి కాగా మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆందోళనలపై ఉక్కుపాదం
 
 ఫీ రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలంటూ కాలేజీ యాజమాన్యాలు చేసిన ఆందోళనలపై కేసీఆర్ ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబించింది. కాలేజీ యాజమాన్యాలను బెదిరించడం, అక్రమ కేసుల నమోదుతో బెంబేలెత్తిన యాజమాన్యాలు దిగొచ్చి ప్రభుత్వాన్ని బతిమిలాడుకున్నాయి. దాంతో ప్రభుత్వం అడపాదడపా నిధులు ఇచ్చినట్టుగా చేసేవారు. మొత్తం బకాయిల్లో 0.01 శాతం విడుదల చేసి మీడియాలో మొత్తం విడుదల చేసినట్టుగా ప్రచారం చేసుకునే వారు. దీంతో అప్పటివరకు అప్పులు ఇచ్చినవారు వచ్చి యజమాన్యాలపై ఒత్తిడి తెచ్చేవారు. పైగా అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా ఎవరైనా విద్యార్థులను ఫీజు అడిగితే ఆయా ప్రిన్సిపల్ పైన, ఆ కాలేజీ పైన చర్యలు తీసుకుంటామని బహిరంగంగానే నోటీసులు జారీ చేసేవారు. ఈ పరిస్థితిలో దివాలా తీసిన చాలా కాలేజీలు ఫర్నిచర్ కూడా అమ్ముకుని అప్పులు కట్టి కాలేజీలు మూసేశారు. తెలంగాణ వ్యాప్తంగా చాలామంది నిరుద్యోగులు స్థాపించుకున్న కాలేజీలు వాటిపై ఆధారపడిన అధ్యాపకులు అందరూ రోడ్లపై పడాల్సిన దుస్థితి ఏర్పడింది. పైగా  ఫీ రీయంబర్స్ మెంట్ విడుదల కొరకు అప్పట్లో మంత్రులను కలిసినప్పుడు వారి నుంచి ఎదుర్కొన్న ఛీత్కాకారాలు అవమానాలు అన్ని ఇన్నీ కావు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారుగా 25 శాతం బకాయిలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు చెల్లించలేదు. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల బకాయిలు కూడా ఇంతవరకు ప్రభుత్వం చెల్లించ లేదు. దీంతో ఆయా కాలేజీలు అప్పుల పాలై దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. జూనియర్, డిగ్రీ కళాశాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఈ కళాశాల్లో చదివే మొత్తం విద్యార్థులు కేవలం ఫీ రీయంబర్స్ మెంట్ పైన ఆధారపడే చదువుకుంటారు ఒకవేళ ఈ పథకం లేనట్టయితే విద్యార్థులు చదువులకు దూరం కావల్సిందే. 
కాలేజీల వర్గీకరణ
 
అనేక పోరాటాల ఫలితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలేజీలను రెండు వర్గాలుగా విభజించింది. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలను ప్రొఫెషనల్ కాలేజీలుగానూ, జూనియర్ డిగ్రీ కాలేజీలను ఇంకో వర్గంగాను ప్రభుత్వం విభజించింది. వేరు వేరు ఫార్మాట్లలో ఈ కాలేజీలకు ఫీ రీయంబర్స్ మెంట్ నిధులు విడుదల చేసేవారు. ప్రొఫెషనల్ కాలేజీ వారు రియంబర్స్ మెంట్ పోను మిగతా ఫీజును విద్యార్థుల వద్ద వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. ఉదాహరణకు ఏదైనా ఒక ఇంజినీరింగ్ కాలేజీ ఫీజు రూ. 1.20 లక్షలు అనుకుంటే అందులో రూ. 35000 ప్రభుత్వం ఇస్తుంది. మిగతాదంతా విద్యార్థులు కట్టవలసిందే. కానీ జూనియర్, డిగ్రీ కళాశాలల పరిస్థితి అలా ఉండదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఫీ రీయంబర్స్ మెంట్ పైనే ఆధారపడతారు. జూనియర్, డిగ్రీ కళాశాల్లో సుమారు రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఇప్పటివరకు ఉన్న పూర్తి బకాయిలు కేవలం రూ.750 కోట్లు. మొత్తం ఇంజనీరింగ్ కళాశాలతో కలిపితే సుమారు 16 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి రూ. 7500 కోట్లు బకాయిలు ఉన్నప్పటికీ తక్కువ బడ్జెట్ తో ఎక్కువ మంది విద్యార్థులు లాభపడుతున్నది మాత్రం జూనియర్, డిగ్రీ కళాశాల్లోనే. 
ఊసెత్తని రేవంత్
 
బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంతో కోమాలోకి వెళ్లిన ఫీ రీయంబర్స్ మెంట్ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్వీర్యం చేసే దిశగా కనిపిస్తున్నది. అధికారంలోకి వచ్చి 5 నెలలవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి బకాయిలపై మాట కూడా మాట్లాడ్డం లేదు. అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని కొనసాగించడంతో పాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి బడ్జెట్ విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కాక బకాయిల గురించి అడగడానికి ఆయా యూనియన్ నాయకులకు కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఫీ రీయంబర్స్ మెంట్ పథకం అమలులో గత ప్రభుత్వ పాలసీనే ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తుందేమోనని కాలేజీల యాజమాన్యాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఈ ఫీ రీయంబర్స్ మెంట్ పథకం వచ్చిన తర్వాత చాలామంది పేద విద్యార్థులు ఉన్నత విద్య చదవడమే కాకుండా మంచి ఉద్యోగాలు కూడా సాధించగలిగారు. ఇలా ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఇంత మంచి పథకాన్ని నీరుకార్చే ఆలోచన సరైంది కాదని పలువురు విద్యారంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.