రైతులను మోసగించిన కాంగ్రెస్

రైతులందరి ఋణాలు మాఫీ చేయాలి  సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ 

Aug 22, 2024 - 20:18
 0
రైతులను మోసగించిన కాంగ్రెస్

నా తెలంగాణ, సంగారెడ్డి: ఋణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసగించిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో  సంగారెడ్డి తహసిల్దార్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల ఋణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి దశలవారీగా పూర్తిగా మాఫీ చేయలేదన్నారు. రైతుల ఋణాలు మాఫీ అయితే అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తారని ఆయన ప్రశ్నించారు. రైతు ఋణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులకు కూడా ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

సీఎంతో పాటు మంత్రులు రైతు ఋణమాఫీ ఏ మేరకు జరిగిందో లెక్కలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఋణమాఫీ కొందరికి చేస్తే సరిపోదని, రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా  బేషరతుగా ఋణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులందరికి ఋణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ జడ్పిటిసి మనోహర్ గౌడ్, మాజీ సిడిసి చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎం. ఏ. హకీమ్, మందుల వరలక్ష్మి, సత్యం తదితరులు పాల్గొన్నారు.