-
- ఆహార ఉత్పత్తుల్లో మిగులుదేశంగా భారత్
- పోషకాహార భద్రతకు అనేక చర్యలు
- సాంప్రదాయ వ్యవసాయంతోనే రైతులకు మేలు, వ్యవసాయ రంగం పటిష్ఠత
- ఐసీఎఈ 32వ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వ్యక్తుల జీవన సమయాన్ని పెంచేందుకు, ప్రతీ ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దరి చేర్చాలంటే సేంద్రీయ వ్యవసాయం ఎంతో దోహదపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఆది నుంచి సేంద్రీయ వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలుస్తూ వస్తుందన్నారు. భారత్ ఆహార మిగులు దేశంగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అదే సమయంలో ప్రపంచ పోషకాహార భద్రతకు కూడా అనేక పరిష్కార మార్గాలను భారత్ చూపుతోందని తెలిపారు. వ్యవసాయ రంగం పటిష్ఠత, రైతులకు మేలు చేసేందుకు సాంప్రదాయమైన, సాంకేతికతతో కూడిన పద్ధతులను విరివిగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
న్యూ ఢిల్లీలో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల వార్షిక (ఐసీఎఈ) సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 75 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వీరందరికి భారత్ లోని రైతుల తరఫున ప్రధాని మోదీ స్వాగతం పలికారు. 65యేళ్ల తరువాత ఈ సదస్సు భారత్ లో జరగడం విశేషం. ఆగస్ట్ 2, ప్రారంభమైన ఈ సదస్సు ఆగస్ట్ 7న ముగియనుంది.
అత్యంత పురాతనమైనదే సేంద్రీయ వ్యవసాయం..
వ్యవసాయ రంగంలో భారత్ వృద్ధి అగ్రస్థానంలో కొనసాగుతుందన్నారు. మరింత ఉత్పత్తి పెంచేందుకు సురక్షితమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయంలో భారత్ లో వినియోగిస్తున్న సంప్రదాయ పద్ధతుల ద్వారా (సేంద్రీయ వ్యవసాయం) సత్ఫలితాలను సాధిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది సేంద్రీయ వ్యవసాయం అని ప్రధాని తెలిపారు.
వ్యవసాయ రంగానికి సాంకేతికత, సైన్స్ ను కూడా జోడిస్తున్నాం..
ప్రపంచంలో ఆహార ఉత్పత్తుల్లో పెరుగుదుల నమోదు కావాలంటే సెంద్రీయ పద్ధతిని ముందుగా ప్రపంచదేశాలు అర్థం చేసుకునే అవసరం ఉందన్నారు. ఈ పద్ధతి ద్వారా మేలురకమైన ఆహారధాన్యాలు ఉత్పత్తి చేయగలుగుతామన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుదల వల్ల తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్నారు. ఉత్పత్తులను పెంచేందుకు ప్రతీ ఒక్క దేశం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు సాంకేతికత, సైన్స్ ను కూడా దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందులో సత్ఫలితాలు సాధిస్తున్నామన్నారు.
వ్యవసాయ అనుబంధ కళాశాలలు, రీసెర్చ్ సెంటర్ లు అనేకం..
వ్యవసాయానికి సంబంధించిన యూనివర్సిటీలు, రీసెర్చ్ కళాశాలలు భారత్ లో వందకు పైగా ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా నిరంతరం నాణ్యమైన ఆహార ధాన్యాలను ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 500కు పైగా కళాశాలలు రైతులకు కొత్త సాంకేతికత వినియోగంపై తర్ఫీదు కల్పిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. 700 కంటే ఎక్కువ వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు భారత్ లో ఉన్నాయని తెలిపారు.
సవాళ్ల పరిష్కారంపై నాణ్యమైన విధానమే లక్ష్యం..
ఈ సదస్సు సుస్థిర వ్యవసాయ-ఆహార వ్యవస్థలకు పరివర్తన, వాతావరణ మార్పు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, సంఘర్షణ వంటి ప్రపంచ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని స్థిరమైన వ్యవసాయం, తక్షణ అవసరాన్ని పరిష్కరించేందుకు తోడ్పడుతుందని ప్రధాని తెలిపారు. ఈ సదస్సు ప్రపంచ వ్యవసాయ సవాళ్లపై భారతదేశం నాణ్యమైన విధానాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర పేర్కొన్నారు.