ముంబాయి: లారెన్స్ బిష్ణోయ్ మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలని ఓ పార్టీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది! 2015 నుంచి పలు నేరారోపణలపై గుజరాత్ లోని సాబర్మతి జైలులో ఉన్నాడు. ఇతనిపై బెదిరింపులు, హత్య, కిడ్నాప్ లాంటి అనేక ఆరోపణలున్నాయి. ఇటీవల ఎన్సీపీ ఎమ్మెల్యే బాబా సిద్దిఖీ హత్యలో కూడా ఇతని ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇతని పోటీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర భారతీయ వికాస్ సేనా (యూబీవిఎస్) అధ్యక్షుడు సునీల్ శుక్లా లారెన్స్ బిష్ణోయ్ తన పార్టీ తరఫున మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలని మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖలో లారెన్స్ ను భగత్ సింగ్ గా అభివర్ణించారు.
మహారాష్ట్రలో అనేక యేళ్లుగా ఉంటూ నిరాదరణకు గురవుతున్న ఉత్తరభారతీయుల ప్రాబల్యం పెరగాల్సిన అవసరం ఉందని అందుకే లారెన్స్ ను ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా లేఖ రాశామని సునీల్ శుక్లా మీడియాకు వివరించారు. ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో నలుగురు అభ్యర్థుల పేర్లను ఈ పార్టీ ప్రకటించింది. మరో 50 మంది పేర్లను ఖరారు చేస్తామని సునీల్ తెలిపారు.
లారెన్స్ బిష్ణోయ్ మూలాలు విదేశాల్లో కూడా ఉన్నాయి. ఇతని నేతృత్వంలో 700మంది షార్ప్ షూటర్లు ఉన్నట్లుగా దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. ఇతను జైలు నుంచి సైగ చేస్తే బయట ఎంతటి పనులైనా ఇట్టే జరిగిపోతాయనే అపోహలున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింక హత్య కేసు తెలిసిందే. బిష్ణోయ్ తెగ కృష్ణ జింకను పూజిస్తారు. ఈ నేపథ్యంలో అతన్ని కూడా మట్టుబెడతానని పలుమార్లు బెదిరించాడు. ఇప్పటికైనా బహిరంగంగా క్షమాపణ తెలిపితే వివాదం సద్దుమణుగుతుందని లేకుంటే చావు తప్పదని హెచ్చరించాడు.
కాగా యూబీవిఎస్ ఆఫర్ ను లారెన్స్ బిష్ణోయ్ ఒప్పుకుంటాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ పోటీకి సై అంటే మాత్రం ఇది దేశవ్యాప్త సంచలనానికి దారితీసే అవకాశం ఉంది.