అన్ని విధాలా భారత్ సహకారం
పుతిన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు
కజాన్ లో భారత రాయబార కార్యాలయం
ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తున్న బ్రిక్స్
మాస్కో: ప్రతి సమస్యకు శాంతియుతం పరిష్కారం మార్గం సాధ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా కజాన్ వెళ్లిన ప్రధాని మోదీ రష్యాఅధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య రష్యా–ఉక్రెయిన్ యుద్ధం గురించి మోదీ శాంతిమార్గం ద్వారా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని భారత్ అభిప్రాయాన్ని నొక్కి వక్కాణించారు. రష్యాతో భారత్ ది చారిత్రాత్మక బంధమన్నారు. భారత్ తమ వైఖరిపై దృఢంగా ఉందన్నారు. శాంతికోసం అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.
బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు భారత్ కు ఆతిథ్యం ఇచ్చినందుకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కజాన్ అందమైన నగరమన్నారు. ఈ నగరంలో భారత్ కాన్సులేట్ (రాయబార కార్యాలయం) ప్రారంభిస్తామని తెలిపారు. రష్యాలో స్వల్ప వ్యవధిలో రెండు పర్యటనలు తమ లోతైన స్నేహాన్ని చాటిచెబుతున్నాయని పేర్కొన్నారు. 15 సంవత్సరాలలో బ్రిక్స్ క్రమంగా బలోపేతం అవుతూ ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని తెలిపారు. ఎన్నో దేశాలు ఇప్పుడు బ్రిక్స్ లో చేరాలని అనుకుంటున్నట్లు మోదీ చెప్పారు. తాను బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నానన్నారు.
భారత్ నిర్ణయాలతో ప్రపంచానికి మేలు: పుతిన్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. తమకు ప్రధాని మోదీ (భారత్) ఎన్నటికీ మిత్రదేశమే అన్నారు. తామిద్దరం అనేక విషయాల్లో ఫోన్ లో సంభాషించామన్నారు. కజాన్ కు వచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మోదీతో విందులో పాల్గొనడం తన అదృష్టమన్నారు. కజాన్ లో రాయబార కార్యాలయం తెరవడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. భారత్ విధానాలు ప్రపంచదేశాలకు మేలు చేసేవిగా ఉండడం సంతోషకరమన్నారు.