కేజ్రీవాల్ అరెస్ట్ కు లైన్ క్లియర్
సీఎం పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు.. ఈడీ ఆధారాల సమర్పణ.. అరెస్ట్ ఎందుకు చేయలేదన్న కోర్టు.. ఆధారాలను రూఢీ చేసుకున్నాకే అరెస్టు చేస్తామన్న ఈడీ
తెలంగాణ, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్టు చేయకుండా చూడాలంటూ ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. దాంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదని తేలిపోయింది. ఈడీ నుంచి తనకు రక్షణ కల్పించాలని, విచారణ పేరిట అమర్యాదగా ప్రవర్తించరాదని కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ కేసుపై ఈడీకి ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో గంటలోనే ఆధారాలను ఈడీ సమర్పించింది. ఆధారాల సమర్పణ సందర్భంగా కోర్టుకు పలు కీలక విషయాలను విన్నవించింది. దర్యాప్తు సంస్థలు తొమ్మిదిసార్లు విచారణకు పిలిస్తే సాక్షాత్తూ సీఎం హోదాలో ఉన్న వ్యక్తే రాకుంటే సామాన్యులకు దర్యాప్తు సంస్థలు, చట్టంపై ఏం గౌరవం ఉంటుందని కోర్టుకు విన్నవించింది. సీఎంను అరెస్టు చేసే పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఇక ఈ విషయంలో ఉపేక్షించేది లేదని కోర్టుకు స్పష్టం చేసింది. దీనిపై కోర్టు స్పందిస్తూ సమన్ల మీద సమన్లు పంపిస్తున్నారు. అరెస్ట్ ఎందుకు చేయలేదని? ఎవరైనా ఈడీని ఆపారా? అని ప్రశ్నించింది. దీనిపై న్యాయవాది ఎస్వి రాజు మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ఆధారాల ఆధారంగా చట్టప్రకారం విచారణ చేశాకే సీఎం హోదాలో ఉన్న ఆయన్ను అరెస్టు చేయగలమని కోర్టుకు వివరించారు. ఈడీ సమర్పించిన ఆధారాలను విశ్లేషించిన కోర్టు కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ కేసుపై మరోమారు మార్చి 22న శుక్రవారం విచారణ జరగనుంది.
కోర్టులో ఉదయం నుంచి మద్యం కుంభకోణంపై అనుహ్యా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఆయనను అరెస్టు చేయకుండా కోర్టు ఈడీకి ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఇప్పటికే ఈ కేసులో బెయిల్ కూడా పొందామని కోర్టుకు విన్నవించారు. ఈడీకి కోర్టు ఆధారాల సమర్పణ ఆదేశాలు, గంటలోపే ఆధారాల సమర్పణ, కేజ్రీవాల్ అరెస్ట్ చేయొద్దంటూ వేసిన పిటిషన్ తిరస్కరణ తదితర పరిణామాలు వేగంగా జరిగిపోయాయి.