విదేశాల్లో రాహుల్​ వ్యాఖ్యలు కేసు నమోదు చేస్తాం

చట్టపరంగా పోరాటం కేంద్రమంత్రి హర్దీప్​ సింగ్​ పూరీ ఆగ్రహం

Sep 10, 2024 - 15:14
 0
విదేశాల్లో రాహుల్​ వ్యాఖ్యలు కేసు నమోదు చేస్తాం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సిక్కులపై రాహుల్​ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్​ సింగ్​ పూరీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనపై మండిపడ్డారు. కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలోనే పక్కా ప్రణాళికతోనే ఊచకోత జరిగిందని పూరీ ఆరోపించారు. ఇందుకు రాహుల్​ గాంధీపై చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని, కేసు నమోదు చేస్తామని పూరీ స్పష్టం చేశారు.
 
మంగళవారం న్యూ ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్​ గాంధీ సిక్కుల ఊచకోత అంశం ప్రస్తావనపై మాట్లాడుతూ.. ఆయన తన తప్పును అంగీకరించకుండా ఇతరులపై ప్రశ్నలు సంధిస్తున్నారని అన్నారు. విదేశీ పర్యటనలో రాహుల్​ దేశ పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిక్కుల క్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించిందన్నారు. కర్తార్​ పూర్​ కారిడార్​ ప్రారంభం సిక్కుల గౌరవాన్ని పెంచిందన్నారు. రాహుల్ విద్వేష దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు. ఈ ప్రకటనపై కోర్టుకు వెళతామని తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం అనిపించుకోవని పూరీ అన్నారు. ఇప్పటికైనా రాహుల్​ ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలన్నారు. గురుద్వారాలలో లంగర్​ పై పన్నును మాఫీ చేసింది మోదీ ప్రభుత్వమని గుర్తు చేశారు. అనేకమార్లు సిక్కుల దేవాలయాలను సందర్శించిన మోదీ తమ మతానికి పూర్తి గౌరవం ఇచ్చారని, భక్తి ప్రవత్తులతో మెలిగారని హర్దీప్​ సింగ్​ పూరీ స్పష్టం చేశారు.