హాజీపూర్ నుంచి చిరాగ్ నామినేషన్ తండ్రి అడుగుజాడలే తనకు స్ఫూర్తి
ఎల్జేపీ అధ్యక్షుడు రిజర్వేషన్లపై తప్పుడు ప్రసారం.. ఆర్జేడీ తేజస్వీకి హెచ్చరిక పాశ్వాన్ విజయానికి శ్రమిస్తున్న బీజేపీ
పాట్నా: బిహార్ హాట్ సీట్ హాజీపూర్ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మే 20న ఈ స్థానానికి ఐదో దశలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ దాఖలుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తండ్రి రామ్ విలాస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆయన ఆశీస్సులే తన బలమని పేర్కొన్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవలో ముందుంటానని స్పష్టం చేశారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ పై మండిపడ్డారు. రిజర్వేషన్లపై తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో ప్రసారం చేస్తూ మభ్యపెట్టడం మానేయాలన్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు.
రామ్‌విలాస్ పాశ్వాన్ హాజీపూర్ స్థానం నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రామ్‌విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పరాస్ ఇక్కడ నుంచి గెలుపొందారు. చిరాగ్ పాశ్వాన్ ఇంతకు ముందు రెండుసార్లు జముయ్ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో జముయి నుంచి గెలుపొందారు. అయితే, ఈసారి చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి సీటు హాజీపూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా ఎన్డీయే కూటమిలో ఎల్జేపీ భాగస్వామ్య పార్టీ. బీజేపీ తరఫున కూడా హాజీపూర్ సీటు విజయానికి పూర్తి శక్తియుక్తులు ఒడ్డుతోంది.