స్పైడర్​ అటాక్..​ నక్సల్స్​ కు భారీ నష్టం

Spider attack.. Heavy loss to Naxals

Oct 6, 2024 - 14:38
 0
స్పైడర్​ అటాక్..​ నక్సల్స్​ కు భారీ నష్టం
గతంకంటే భిన్నమైన ఆపరేషన్​ 
తొలిసారిగా భారీ ఆపరేషన్​ కు దుర్గా, దంతేశ్వరీ మహిళా దళాలు
12కిలోల బ్యాగు, రోజువారి అన్నపానీయాల బరువుతో 40కి.మీ. కాలినడక
అమావాస్య చీకట్లు, కురుస్తున్న భారీ వర్షంలోనూ వెరవని మహిళా సైనికులు
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: సాలీడు ( స్పైడర్​)వ్యూహాంతో నక్సల్స్​ కు భద్రతా బలగాలు భారీ నష్టాన్ని చేకూర్చాయి. దీనికి తోడు అమావాస్య చీకట్లు, వర్షం లాంటి వాతావరణ పరిస్థితులు కూడా భద్రతా బలగాలకు అనుకూలంగా మారాయి. మరోవైపు ఈ దాడుల్లో తొలిసారిగా మహిళా ఆర్మీ దళాలను రంగంలోకి దింపారు. దుర్గా, దంతేశ్వరి దళాలు నక్సల్స్​ వ్యతిరేక ఆపరేషన్​ లో విజయవంతమయ్యాయి. భుజంపై 12 కిలోల రైఫిల్​ బరువుతోపాటు రోజువారీ అన్నపానీయాల సంచులను మోసుకుంటూ కొండాకోనలు, అసలు దారులే లేని ప్రాంతాల్లో ఈ దళాలు 40కి.మీ. కాలినడక వెళ్లారు. కారుచీకట్లలో నైట్​ విజన్​ కెమెరాతో ఎక్కడా ఆగకుండా ముందుకు సాగారు. ఆపరేషన్​ ను పూర్తిచేసుకొని సురక్షితంగా తిరిగి వచ్చాయి. 
 
ఏమిటీ సాలీడు వ్యూహం..
పేరు చెప్పేందుకు ఇష్​టపడని ఓ ఆర్మీ అధికారి ఈ వ్యూహం గురించి తెలిపారు. సాధారణంగా ఒక సమాచారం వస్తే అదీ సరైందా? లేదా? ముందుగా నిర్ధరించుకోవడం ఒక ఎత్తు. ఒకవేళ సైనికులు ఆ ప్రాంతానికి వెళ్లి సమాచారం సరైంది కాకుంటే నక్సల్స్​ ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఉంది. మరోవైపు నక్సల్స్​ ఎక్కువగా యూ, వై, వీ ఆకారాల వ్యూహాలతోనే దాడులకు దిగుతుంటారు. వీటిని అడ్డుకుంటూ సమర్థవంతంగా దాడి చేయడమే తమకు సవాల్​ గా నిలిచేది. అయితే ఇతర వ్యూహాల్లో భద్రతా బలగాల వైపు కూడా నష్టం ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది. దీంతో సాలీడు వ్యూహాన్ని అనుసరించడమే ఉత్తమమని నిర్ణయించాం. ఈ వ్యూహం ప్రకారం సాలీడు గూడు పెట్టిన దారాల మాదిరిగా అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడం తొలి వ్యూహం. ఆ తరువాత నక్సల్స్​ తప్పించుకోకుండా దాడి చేయడం వ్యూహాంలో తరువాయి అంకమని వివరించారు. ఈ వ్యూహాంలో అపజయం అనేది ఉండదన్నారు. కాకపోతే సైనిక బలగమే పెద్ద యెత్తున అవసరం అవుతుందన్నారు. ఇదే వ్యూహాన్ని వినియోగించి సమయం ఎక్కువైనా నక్సల్స్​ ను సమర్థవంతంగా చుట్టుముట్టామని తెలిపారు. ఈ వ్యూహాంలో నష్టం ఉండదన్నారు. 
 
ఏది ఏమైనా 31 మంది నక్సల్స్​ మృతి చెందడం వారికి భారీ నష్టాన్ని కలగజేసిందని చెప్పొచ్చు. ఇక దండకారణ్యంలో సమావేశాలంటేనే భయపడే స్థాయిలో ఈ ఆపరేషన్​ కొనసాగడం విశేషం. మృతిచెందిన నక్సలైట్లలో మొత్తం రూ. 1.60 కోట్ల రివార్డు ప్రకటించిన వారు ఉన్నారు.