సమస్యలు పట్టించుకోని చైర్మన్, కమిషనర్
బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిల్ సభ రసాభాస వాకౌట్ చేసిన కౌన్సిలర్లు
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: ప్రజా సమస్యలను పరిష్కరించని మున్సిపాలిటీ చైర్మన్, కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుపై క్యాతన్ పల్లి బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిరసనకు దిగిన బీఆర్ ఎస్, బీజేపీ, కో ఆప్షన్ సభ్యులు సభను మధ్యలోనే వాకౌవుట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. రోడ్లు, ఈగలు, దోమల వల్ల ప్రజలు తీవ్ర సమస్యలతో సతమతం అవుతున్నారని అన్నారు. వర్షాకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పలుమార్లు కోరినా కమిషనర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆయా సమస్యలను స్థానికులు, మున్సిపాలిటీ కార్మికులు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితే వారినే భయపెడుతున్నారని మండిపడ్డారు. రెండు నెలల క్రితం కార్మికుడు మృతి చెందితే ఇంతవరకూ ఆ కుటుంబానికి రావాల్సిన ఆర్థిక సహాయం అందజేయలేదన్నారు. కార్మికుల సమస్యలనే పట్టించుకోని కమిషనర్ చర్యలపై మండిపడ్డారు.