దళితులపై దాడులు పార్లమెంట్ లో కాంగ్రెస్, ఎస్పీ లేవనెత్తరేం
ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి
లక్నో: బంగ్లాదేశ్ లో దళితులపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపై కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ ఎందుకు మౌనంగా ఉందని, ముస్లిం ఓట్ల కోసం ఈ పార్టీలు అర్రులు చాస్తున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. శనివారం లక్నోలో మీడియాతో మాయావతి మాట్లాడారు. పార్లమెంట్ లో ప్రతిపక్షం జాతీయ, ప్రజా ప్రయోజనాలు లేవనెత్తకుండా తమ స్వప్రయోజనాల కోసం సంభాల్ హింసాకాండను లేవనెత్తుతూ తప్పించుకుంటుందన్నారు. ముస్లిం ఓట్ల కోసం ఈ పార్టీలు కుటీల యత్నానికి తెరతీశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముస్లిం సమాజం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దళిత వర్గాల ఎంపీలు పార్లమెంట్ లో మౌనం వహించడం మంచిది కాదన్నారు. బంగ్లాదేశ్ లో అన్ని వర్గాలు, హిందూ ప్రజలు అఘాయిత్యాలకు, దాడులకు గురవుతున్నారని అన్నారు. మెజార్టీగా దళితులే అందులో ఉన్నారని తెలిపారు. బాబా సాహెబ్ బెంగాల్‌లోని జైసోర్-ఖుల్నా ప్రాంతం నుంచి రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైనప్పుడు, అది హిందూ మెజారిటీ ప్రాంతంగా ఉందన్నారు. అయినా కుటీలనీతి పార్టీల వల్ల కులతత్వ ఆటలతో ఆ ప్రాంత ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడారని మండిపడ్డారు. బంగ్లాలో దళితులు దోపిడీ, దాడులకు గురవుతున్నా కాంగ్రెస్, ఎస్పీ పార్టీల మౌనంపై మాయావతి మండిపడ్డారు.