నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ, అవినీతి ఆరోపణలో కేజ్రీవాల్ కు సుప్రీంలోనూ ఊరట లభించలేదు. గురువారం ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వు చేసింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంలో వాదనలు వినిపించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కేజ్రీవాల్ పేరు లేదన్నారు. ఇటీవలే కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ సీఎం సమాజానికి ప్రమాదకరం కాదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. కేజ్రీవాల్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని రెండుసార్లు సుప్రీంకోర్టు, ఒకసారి ట్రయల్ కోర్టు ఆదేశించాయని సింఘ్వీ తెలిపారు. కాగా సుప్రీంకు సీబీఐ తమ వాదనలు వినిపిస్తూ సీఎంకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జ్వల్ భూయాన్ లతో కూడిన ధర్మాసనం తమ నిర్ణయాన్ని రిజర్వు చేసింది.