నాలుగో రోజు ఉభయ సభలు వాయిదా
విపక్షాలపై ఉపరాష్ట్రపతి ఆగ్రహం డిసెంబర్ 2న సమావేశాలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వరుసగా నాలుగో రోజు కూడా ఉభయ సభలు ఎలాంటి చర్చ జరగకుండానే వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంట్, రాజ్య సభ సమావేశాల్లో కాంగ్రెస్, కూటమి పార్టీలు అదానీ, మణిపూర్, సంభాల్, శాంతిభద్రతలు తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టాయి. నిరసనల మధ్య ఉభయ సభల సమావేశాలు 2వ తేదీకి వాయిదా వేశారు.
రాజ్యసభలో విపక్షాల గందరగోళాన్ని, నిరసనలను రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ తప్పుబట్టారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో అర్థవంతమైన చర్చ జరగకుండా అడ్డుకోరాదన్నారు. సభ గౌరవ, మర్యాదలను కాపాడాలని విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర విషయాలను చర్చించేందుకు ఉన్న 267ను సభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు వినియోగించడం దురదృష్టకరమన్నారు. పలుమార్లు చెప్పినా విపక్షాలు వినకపోవడంతో రాజ్యసభను 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ లోనూ ఇదే తీరున నిరసనలు కొనసాగడంతో సమావేశాలను 2కు వాయిదా వేశారు.