యూఎన్ శాంతి కమిషన్ లో భారత్ ఎంపిక
మోదీ విధానంతో ప్రపంచదేశాలు ప్రభావితం
న్యూయార్క్: యూఎన్ (ఐక్యరాజ్యసమితి) శాంతి పరిరక్షణ కమిషన్ లో మరోసారి భారత్ ఎన్నికైంది. ప్రధాని నరేంద్ర మోదీ దక్షత, దౌత్యం ప్రపంచాన్ని ఆకట్టుకుంటుండంతో అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. గురువారం జరిగిన 2025–26కు సంబంధించిన యూఎన్ శాంతి పరిరక్షణ కమిషన్ లో భారత్ ఎంపికైనట్లు ప్రకటించారు. 2024–25 పదవీ కాలం 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోమారు దేశాల ఎంపిక అనివార్యమైంది.
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణకు వ్యవస్థాపక సభ్యదేశంగా, ప్రధాన సహకారిగా, ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం పని చేయడానికి పీబీసీతో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలకు యూనిఫాం ధరించిన (సైనిక సహకారం) సిబ్బందిని అత్యధికంగా అందించిన దేశాల్లో భారతదేశం ఒకటి. యూఎన్ కార్యకలాపాలలో భాగంగా భారతదేశం ప్రస్తుతం అబై, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సైప్రస్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లెబనాన్, మిడిల్ ఈస్ట్, సోమాలియా, సౌత్ సూడాన్, పశ్చిమ సహారాలో 6,000 మంది సైనిక, పోలీసు సిబ్బందిని మోహరించారు.