నూతన కమిషనర్ ను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
నా తెలంగాణ, హైదరాబాద్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు సమాచార, పౌరసంబంధాల శాఖ నూతన కమిషనర్ ఎస్. హరీష్ కు విజ్ఞప్తి చేశారు. నూతనంగా నియమితులైన కమిషనర్ హరీష్ కు పూలబొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందం, కార్యదర్శులు ఎస్ కే సలీమా, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
మీడియా అకాడమి చైర్మన్ ఏకపక్ష ధోరణిపై కమిషనర్ కు ఫిర్యాదు..
అనంతరం జర్నలిస్టుల సమస్యలపై అరగంటపాటు భేటీ అయ్యారు. ఇళ్ల స్థలాల సమస్య గత నలభై ఏళ్లుగా పెండింగ్ లో ఉందన్నారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటి, డక్కన్ సొసైటీ, తెలంగాణ సొసైటీ తదితర సొసైటీలలో సభ్యులుగా ఉన్న జర్నలిస్టులతో పాటు ఏ సొసైటీలో లేని అర్హులైన జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాల ఇవ్వాలని వారు కోరారు. జర్నలిస్టులకు ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేయడంలేదని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. చిన్న పత్రికలకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయని, ఆ సమస్యలను పరిష్కరించి చిన్న పత్రికలను ఆదుకోవాలని కోరారు. మీడియా అకాడమి ఛైర్మన్ అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణిపై కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుల సమస్యలపై కమీషనర్ హరీష్ స్పందిస్తూ, జర్నలిస్టుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.