బాధ్యతతో మెలగాలి, తమాషాలొద్దు
Be responsible, don't joke
తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ప్రమాదస్థలి, స్విమ్స్ లో బాధితుల పరామర్శ
తిరుపతి: తిరుపతి తొక్కిసలాట జరిగిన బైరాగిపట్టెడ ప్రాంతానికి గురువారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబునాయుడు చేరుకొని ప్రమాద వివరాలను ఆరా తీశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండువేల మందికి టోకెన్ల జారీ నిర్ణయించి, 2500మందిని ఎలా అనుమతిస్తారని నిలదీశారు. బాధ్యతలను సరిగ్గా నెరవేర్చకుండా తప్పించుకుంటే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిసినా అందుకు తగ్గట్లు ఏర్పాట్లు ఎందుకు చేయలేదని నిలదీశారు. టోకెన్ల జారీ క్యూలైన్ వద్ద హెచ్చరిక బోర్డులు, నోటీసు బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. సీఎం అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు. ఒక గంటపాటు సంఘటనా స్థలంలోనే ఉండి కలెక్టర్, ఎస్పీ, టీటీడీ అధికారుల తీరుపై మండిపడ్డారు. అనంతరం స్విమ్స్ లోని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని మెరుగైన వైద్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద ఘటనపై అధికారులు అందరూ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బాధ్యత విషయంలో తాను చెబుతున్నది తమాషా అనుకోవద్దని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఘటన జరిగాక బాధితులకు అందిన సత్వర సహాయంపై వివరాలు అడిగి చంద్రబాబునాయుడు తెలుసుకున్నారు.