గోల్డెన్ అవర్ చికిత్స కీలకం
Golden hour treatment is crucial
కేంద్రం మార్చి 14లోపు మార్గదర్శకాలు రూపొందించాలి
సుప్రీంకోర్టు ఆదేశం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు లేకున్నా గోల్డెన్ అవర్ లో చికిత్స అందించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు, విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించి మార్చి 14 లోగా అమలు చేయాలని స్పష్టం చేసింది. గురువారం రోడ్డు ప్రమాదాల పిటిషన్ ను సుప్రీం కోర్టు జస్టిస్ అభయ్ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 162 ప్రకారం గోల్డెన్ అవర్ లో ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. కీలకమైన సమయంలో పోలీసులు వచ్చే వరకు బాధితులకు అవసరమైన చికిత్స అందడం లేదని ఆవేదన పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమేనని పేర్కొన్నారు. జాప్యం వల్ల ప్రమాదానికి గురైన వారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి గోల్డెన్ అవర్ లో చికిత్స నందించడంలో ప్రాణాలు నిలిచే అవకాశం ఉందని తెలిపారు. మార్చి 14లోపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చర్యలు చేపట్టాలని, తదుపరి విచారణ మార్చి 24 చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు.