బీజేపీ మేనిఫెస్టో విడుదల

దేశ ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధే లక్ష్యం ప్రధాని నరేంద్ర మోదీ

Apr 14, 2024 - 13:40
 0
బీజేపీ మేనిఫెస్టో విడుదల

నా తెలంగాణ, న్యూఢిల్లీ: బీజేపీ  ‘సంకల్ప్​ పత్ర్’ (మేనిఫెస్టో) మహిళలు, పేదలు, రైతులకు సాధికారత కల్పిస్తుందని ధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఉదయం న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో 2024 సార్వత్రిక ఎన్నికల మేని ఫెస్టోను ప్రధానితోపాటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశంలో నవరాత్రి ఉత్సవాల ఆరో రోజన్నారు. ఆదివారం కాత్యాయని అమ్మవారిని ప్రార్థిస్తూ, అంబేద్కర్​ ను స్మరించుకుంటూ బీజేపీ ‘సంకల్ప్​ పత్ర్’ విడుదల చేసిందన్నారు. గడిచిన పదేళ్లలో బీజేపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని తెలిపారు. ఈ సంకల్ప్​ పత్ర్ దేశ ప్రజల సంక్షేమంతోపాటు దేశాభివృద్ధికి కీలకంగా నిలుస్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. 

15 లక్షల సూచనలు, సలహాలు..

2047 నాటికి వికసిత భారత్​ లక్ష్యంతో మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు. మేనిఫెస్టో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. మేనిఫెస్టో కోసం దాదాపు 15 లక్షల సలహాలు సూచనలు పరిశీలించారు. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా మేనిఫెస్టోను రూపొందించినట్లు వెల్లడించారు. 

14 అంశాలతో సంకల్ప పత్ర్..

ఈ మేనిఫెస్టోలో విశ్వబంధు, సురక్షిత భారత్‌, సమృద్ధ భారత్‌, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్‌, అత్యుత్తమ శిక్షణ, క్రీడావికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ లాంటి 14 అంశాలతో కూడుకొని ఉంది. 

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..

'వన్ నేషన్-వన్ ఎలక్షన్', యూసీసీ అమలు: దేశ ప్రయోజనాల దృష్ట్యా కఠిన నిర్ణయాలను తీసుకోవడానికి వెనుకాడమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్టీ కంటే దేశమే పెద్దదని నమ్ముతున్నందున ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే ఆలోచనను సాకారం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతాం. బీజేపీ కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని కూడా అంతే ముఖ్యమైనదిగా పరిగణిస్తోంది. 

వృద్ధులకు ఉచిత వైద్యం:

70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధుడిని ఆయుష్మాన్ పథకం పరిధిలోకి తీసుకువస్తామని ఇప్పుడు మేము తీర్మానించామని ప్రధాని మోదీ అన్నారు. పేద, మధ్యతరగతి లేదా ఎగువ మధ్యతరగతి అనే తేడా లేకుండా 70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధుడికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స సౌకర్యం లభిస్తుంది.

ఇళ్లు, పైప్​ లైన్​ ద్వారా ఇంటింటికీ గ్యాస్​:

బీజేపీ ప్రభుత్వం పేదలకు 4 కోట్ల శాశ్వత ఇళ్లు నిర్మించిందన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న అదనపు సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తూ మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి ముందుకు సాగుతాం. ఇప్పటి వరకు ప్రతి ఇంటికి తక్కువ ధరకే సిలిండర్లు పంపిణీ చేశాం, ఇప్పుడు ప్రతి ఇంటికి చౌకైన పైపులతో కూడిన వంట గ్యాస్‌ను అందించేందుకు వేగంగా కృషి చేస్తాం. దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపడతాం.

మరో ఐదేళ్లు ఉచిత రేషన్‌:

డిగ్నిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైవ్స్, ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఉద్యోగాలపై మా దృష్టి ఉందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఐదేళ్లపాటు ఉచిత రేషన్ పథకం కొనసాగుతుందని మోదీ హామీ ఇచ్చారు. పేదలకు అందించే ఆహారం పౌష్టికాహారంగా, సంతృప్తికరంగా, అందుబాటు ధరలో ఉండేలా చూస్తాం.

రైతులు:

చిన్నరైతుల లబ్ధి కోసం శ్రీఅన్న సాగు ప్రోత్సాహం కల్పిస్తాం. ఎప్పటికప్పుడు పంటల మద్దతు ధర పెంచుతాం.  వ్యవసాయానికి ప్రాధాన్యం కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు ఏర్పాట్లు. వ్యవసాయ మౌలికవసతుల మిషన్‌ ప్రారంభిస్తాం. వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రత్యేక ఉపగ్రహం.  వీటితోపాటు మత్స్యకారులు, పాల ఉత్పత్తుల పెంపు కోసం డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో ఏర్పాటు మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు. ఆహార నిల్వ ప్రక్రియలో తృణధాన్యాల రైతులకు ప్రోత్సాహకాలు, మార్కెటింగ్​ సహకారం. భారతదేశాన్ని గ్లోబల్ న్యూట్రిషన్ హబ్‌గా మార్చడానికి చర్యలు.

మూడు బుల్లెట్​ రైళ్లు, వందేభారత్​ విస్తరణ:

దేశంలోని పశ్చిమ ప్రాంతంలో బుల్లెట్ రైలు (అహ్మదాబాద్-ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్) పనులు శరవేగంగా జరుగుతున్నాయని, దాదాపు పూర్తయ్యే మార్గంలో ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. అదేవిధంగా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, తూర్పు భారతదేశంలో ఒక్కో బుల్లెట్ రైలు కారిడార్ నిర్మించబడుతుంది. దీనికి సంబంధించిన సర్వే పనులు కూడా అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. వందే భారత్​ విస్తరణ కొనసాగిస్తాం. 

మహిళా సంక్షేమం:  

భారత యువత ఆకాంక్షలకు మా తీర్మాన లేఖ ప్రతిబింబమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు! గత పదేళ్లలో, భారతదేశంలోని దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. బీజేపీ బలమైన నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం. భారతదేశం మహిళా నాయకత్వ అభివృద్ధిలో ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోంది. గత 10 సంవత్సరాలు మహిళల గౌరవం, మహిళలకు కొత్త అవకాశాల కోసం అంకితం. రాబోయే ఐదేళ్లలో మహిళా శక్తి కొత్త భాగస్వామ్యం అవుతుంది.ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంచుతాం. మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక రూపకల్పన. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం. సేవారంగంతో స్వయం సహాయక సంఘాల అనుసంధానం.స్వయం సహాయక బృందాలకు ఐటీ, విద్య, ఆరోగ్యం, రిటైల్, పర్యాటక రంగాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. 

పుణ్యక్షేత్రాలు:

తిరువల్లువర్ సాంస్కృతిక కేంద్రాలను నిర్మిస్తాం: అభివృద్ధి మంత్రంతో పాటు వారసత్వాన్ని కూడా బీజేపీ కాపాడుతుంది. ఇందుకోసం దేశంలోని సాంస్కృతిక సంపదలను అభివృద్ధి చేస్తాం. పుణ్యక్షేత్రాల పర్యటనలను ప్రోత్సాహం కల్పిస్తాం. రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో వృద్ధులకు చేయూతనిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా తిరువళ్లువర్ కల్చరల్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం మనది. ప్రపంచవ్యాప్తంగా తమిళ భాష ప్రతిష్టను పెంచేందుకు బీజేపీ అన్ని విధాలా కృషి చేస్తుంది. 

మేనిఫెస్టోలోని మరిన్ని ముఖ్యాంశాలు..

ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. సూర్యఘర్​ యోజన ద్వారా ఇంటింటికీ ఉచిత విద్యుత్​ అందించేందుకు సహకారం. కొత్త శాటిలైట్​ పట్టణాల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. విద్యుత్​, విమానయాన రంగాలకు ప్రోత్సాహం కల్పిస్తాం. రక్షణ, వంటనూనె ఇంధన రంగాలు స్వయం సమృద్ధిని సాధించేలా చర్యలు. గ్రీన్​ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహం. ఉద్యోగ నియామకాల్లో పేపర్​ లీకేజీలపై కఠిన చర్యల చట్టం, పారదర్శక నియామక ప్రక్రియకు గ్రీన్​ సిగ్నల్. స్టార్టప్​ లు, మెంటార్​ షిప్​ లకు మద్దతు.విదేశాల్లోని భారతీయులకు భద్రత హామీ. ఫార్మా, సెమీ కండక్టర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్నోవేషన్‌, లీగల్‌ ఇన్సూరెన్స్‌, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌ల ఏర్పాటు. పరిశ్రమల అభివృద్ధికి మరిన్ని నిర్ణయాలు.