కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత మెడకు "డబుల్" ఉచ్చు
గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని భారీగా వసూళ్లు నివేదిత ఇంటి ముందు బాధితుల ధర్నా నాడు తండ్రితో కలిసి రూ.1.46 కోట్ల వసూళ్లు ఒక్కో బాధితుడి నుంచి రూ.5 లక్షల డబ్బులు వసూలు దాదాపు 30 మందికి ఇండ్లు ఇప్పిస్తామని మోసం
నా తెలంగాణ, సికింద్రాబాద్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు డబుల్ సెగ తగిలింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని దివంగత ఎమ్మెల్యే సాయన్న, బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితలు రూ.కోట్లు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆందోళనకు దిగారు. శనివారం ఆమె ఇంటి ముందు బైఠాయించారు. వారికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా కంటోన్మెంట్ నియోజకవర్గం కార్ఖానాలోని నివేదిత ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో నివేదిత ఇంట్లో లేరు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న నివేదిత ప్రచారంలో భాగంగా బయటకువెళ్లారు. అయితే సొంత నియోజకర్గానికి చెందిన సాయన్న అనుచరులుగా ముద్ర పడిన వారే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బాదితులుగా ధర్నా చేయడం సంచలనం మారింది.
రూ.1.46 కోట్ల వసూళ్లు..?
దివంగత శాసన సభ్యులు సాయన్నతో పాటు ఆమె కుమార్తె, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత రూ.కోటి 46 లక్షలు వసూలు చేసినట్లు బీఆర్ఎస్ నేత సదానంద్ గౌడ్ ఆరోపించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పిస్తామని ఒక్కొ బాధితుడి నుంచి రూ.3 నుంచి రూ.5 లక్షలు చొప్పున 30 మంది బాధితుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఒత్తిడి తీసుకురాగా, గత సంవత్సరం రూ.12 లక్షలు తిరిగి ఇచ్చారని చెప్పారు.
మిగతా రూ.1.34 కోట్లు ఇవ్వాలని బాధితులందరం ఇంటి చుట్టూ తిరిగినా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని, నివేదితను అడిగితే మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి జోక్యం చేసుకొని నేను సెటిల్ చేస్తా అంటూ ఆయన కొన్ని రోజులు తిప్పుకున్నాడని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటే అశపడి ఇతరుల వద్ద వడ్డీలకు అప్పు చేసి రూ. లక్షలలో వారి చేతిలో పెట్టామని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్ర తరం చేస్తామని బాధితులు హెచ్చరించారు.
లాస్య నందిత వీడియో వైరల్..
బీఆర్‌ఎస్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో భారీగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అర్హులైన ప్రతి పేదవాడికి ఎలాంటి పైరవీలు లేకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ మాటలకు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఘటనలకు మధ్య.. తేడా ఉంది. గత సర్కారులో అధికార పార్టీ నేతలే ఇళ్ల పంపిణీ కోసం అక్రమ వసూళ్ల దందాకు తెరలేపిన ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఏకంగా కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత వసూళ్ల దందాకు చెందిన ఆడియో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైరల్‌గా మారింది. వైరలైన ఆ ఆడియో.. మాజీ ఎమ్మెల్యే జి.సాయన్న కుమార్తె దివంగత ఎమ్మెల్యే లాస్య నందితది అని తేలింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు డబ్బులు తీసుకున్నట్టు ఈ ఆడియో ద్వారా తెలిసింది. అయితే ఇళ్లు రాకపోగా.. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అప్పట్లో ఈ వివాదం జరిగింది.
వీడియోలో ఇలా..
ఈ ఆడియోతో తన తండ్రి సాయన్న పదవిని అడ్డు పెట్టుకుని లాస్య నందిత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ వీడియోలో లాస్య నందిత 5 లక్షలు తీసుకున్నట్లు అంగీకరించింది. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఇప్పించలేనందును మరో రూ.3 లక్షలు వడ్డి కలుపుకొని రూ.8 లక్షలు ఇవ్వాలని బాధితుడు లాస్యనందితను డిమాండ్ చేస్తున్నాడు. అయితే తాను వడ్డి ఇవ్వలేనని, వడ్డీ ఎలా ఇస్తానని ఆమె అతనితో వాదించింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎవరికైనా ఇప్పించి మీకు ఇవ్వకుంటే తనను అడగాలని, ఇప్పటి వరకు ఎవరికి ఇప్పించలేదని అందరితో పాటు మీకు వస్తాయని లాస్య నందిత చెబుతోంది. తాజాగా సాయన్నతో సహా ఆమె రెండో కుమార్తె నివేదిత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం రూ.1.46 కోట్లు వసూలు చేసినట్లు బాధితుడు సదానంద్ గౌడ్ ఆరోపించడం, బాధితులు ఆమె ఇంటి వద్ద ఆందోళన చేయడం సంచలనంగా మారింది