నేడే బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల?

కోర్​ కమిటీ భేటీలో పార్టీ గ్రాఫ్​ పెంపుదలపై చర్చలు, నిర్ణయాలు

Feb 28, 2024 - 20:01
 0
నేడే బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల?

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బీజేపీ తొలి ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల కోసం అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్​ షా, రాజ్​ నాథ్​ సింగ్, బీ.ఎల్. సంతోష్,​పార్టీ అధ్యక్షుడు జేపీ.నడ్డాలు అభ్యర్థుల జాబితాను తుదిసారి పరిశీలించి ఆమోదముద్ర వేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.  బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తొలి సమావేశాన్ని గురువారం నిర్వహించనున్నారు.  అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బుధవారం బీజేపీ కోర్​ కమిటీ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ప్రధాని మోదీతో బాటు, మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ ప్రముఖ్​లు హాజరయ్యారు. కోర్​కమిటీ భేటీలో 100–120 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే యోచనకు ఆమోదం తెలిపారు. 2019లో ఓటమి పాలైన స్థానాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని కోర్​ కమిటీ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ఓటమిపాలైన సీట్లపై కారణాలను నియోజకవర్గాల నుంచి తెప్పించి అవే తప్పులు పునరావృతం కాకుండా బీజేపీ పెద్దలు జాగ్రత్తలను వివరించారు. 

ప్రధాని మోదీ ఇప్పటివరకు సభలు, సమావేశాల ద్వారా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.  బీజేపీ 370, ఎన్డీయే 400 దాటాలని అభిప్రాయపడ్డారు. ప్రతి బూత్‌లో పార్టీకి 370 ఓట్లు పెరగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వంద రోజుల్లో ప్రజా సమస్యలపై ఆయా రాష్ర్ట ప్రభుత్వాలను నిలదీస్తూనే ప్రజలతో మెరుగైన సంబంధాలకు కృషి చేయాలని నిర్ణయించారు. గతపదేళ్ల కాలంలో బీజేపీ చేసిన పనులు, పథకాలను దేశంలోని ప్రతీ ఇంటికి, ప్రతీ బూత్​లోని ఓటర్లకు అర్థమయ్యే రీతిలో వివరించాలని నిర్ణయించారు. 

దేశంలోని పోలింగ్​ బూత్​ల సంఖ్య 10 లక్షల 35 వేలు ఈ లెక్కన చూస్తే దేశవ్యాప్తంగా 38 కోట్ల ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయించాలనే ప్రణాళికకు పదును పెట్టే చర్యలు తీసుకోవాలని కోర్​ కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలను బీజేపీ పెద్దలు తీసుకున్నారు. ఇంకా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా గురువారం విడుదలయ్యే అవకాశాలున్నాయి.