ఖాట్మాండూ: నేపాల్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. 27 మంది మృతి చెందారని, 15 మందికి గాయాలయ్యాయని తనహున్ జిల్లా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ జనార్దన్ గౌతమ్ తెలిపారు. శుక్రవారం పోఖారా నుంచి ఖాట్మాండుకు వెళుతున్న భారతయాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. 500 అడుగుల లోతులో మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. బస్సులో యూపీ గోరఖ్ పూర్ నుంచి నేపాల్ యాత్రకు బయలుదేరారని అధికారులు తెలిపారు.
ప్రధాని మోదీ విచారం..
నేపాల్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నేపాల్ లోని భారత రాయబార కార్యాలయం యాత్రికులకు అన్ని విధాలా సహాయం చేయాలని ఆదేశించారు.
ప్రమాదం విషయం తెలుసుకున్న భారత అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఎంఐ–17 విమానం ద్వారా నేపాల్ లోని త్రిభువన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు.