జమ్మూకశ్మీర్​ అభ్యర్థుల ఎంపికపై షా సమావేశం

హాజరైన ప్రముఖులు రాహుల్​ పై షా విమర్శల బాణాలు

Aug 23, 2024 - 23:38
 0
జమ్మూకశ్మీర్​ అభ్యర్థుల ఎంపికపై షా సమావేశం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జమ్మూకశ్మీర్​  ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి, జితేంద్ర సింగ్​, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌, జమ్మూకశ్మీర్​ బీజేపీ అధ్యక్షుడు రవీందర్​ రైనా, దేవేందర్ సింగ్ రాణాలతో న్యూ ఢిల్లీలో శుక్రవారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. 
 
90 స్థానాలున్న జమ్మూకశ్మీర్​ లో మోదీ అభివృద్ధి కార్యక్రమాల తరువాత గ్రౌండ్​ లెవల్​ లో పరిస్థితిపై కేంద్రమంత్రి అమిత్​ షా ఆరా తీశారు. బలమైన అభ్యర్థుల ఎంపికపై కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రైనాలతో సమాచారం సేకరించారు. 
2014లో 25 సీట్లను బీజేపీ గెలుచుకొని పీడీపీ (మహబూబా ముఫ్తీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 
 
మరోవైపు కాంగ్రెస్​, ఎన్సీ (నేషనలిస్ట్​ కాంగ్రెస్​–ఫరూక్​ అబ్దుల్లా) పార్టీల పొత్తుతో రాజకీయ సమీకరణాలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో బీజేపీ ఇరుపార్టీలను ఎదుర్కునే బలమైన అభ్యర్థుల వేటలో పడింది.
 
సమావేశానికి ముందు కేంద్రమంత్రి అమిత్​ షా మీడియాతో మాట్లాడారు. దళితులు, గుజ్జర్లు, బకర్వాల్‌లు, పహాడీలకు రిజర్వేషన్లు రద్దు చేయాలనే జేకేఎన్‌సీ మేనిఫెస్టోకు రాహుల్ గాంధీ మద్దతు ఇస్తున్నారా? అని  ప్రశ్నించారు. రిజర్వేషన్ల విషయంపై కాంగ్రెస్​ పార్టీ తమ విధానాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.దేశ ఐక్యతను కాంగ్రెస్​ దెబ్బతీస్తోందన్నారు. పదే పదే భారత భారత ఐక్యతను ఫణంగా పెడుతోందని మండిపడ్డారు. 
నేషనల్​ కాన్ఫరెన్స్​ ప్రత్యేక రాష్​ర్టం ఏజెండాను రాహుల్​ సమర్థిస్తారా? మరోసారి ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదంలోకి నెడతారా? వేర్పాటువాదం, సరిహద్దుల్లో ఉగ్రవాదం,   రాళ్లదాడులు, ఆర్థిక వ్యవస్థ తదితర ప్రశ్నలను అమిత్​ షా రాహుల్​ గాంధీకి వేశారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాలన్నారు. నేషనల్​ కాన్ఫరెన్స్​ తాము లేవనెత్తిన అంశాలను తమ ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాడుకుంటోందని ఇప్పటికే అనేకమార్లు స్పష్టమైందని ఆ పార్టీతో పొత్తుపెట్టుకొని దేశ సమగ్రతకు కాంగ్రెస్​ భంగం కలిగిస్తోందని అమిత్​ షా మండిపడ్డారు.