ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ పై దాడి
ఆసుపత్రి ఎదుట వైద్య సిబ్బంది నిరసన
నా తెలంగాణ, షాద్ నగర్: షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ పై రోగి తరపు బంధువు దాడి చేసింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది శుక్రవారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. తమ విధులను ఆటంకపరిచి విచక్షణ రహితంగా దాడి చేసిన మహిళపై పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సిబ్బందిపై రోగి తరపు వారు ఇలా దాడులు చేయడం తగదని యూనియన్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన మహిళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విధుల్లో తమకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీస్ స్టేషన్లో ఈ అంశంపై ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. కుక్క కాటు వ్యాక్సినేషన్ కోసం వచ్చిన మహిళ ఈ ఘాతుకానికి పాల్పడిందని సిబ్బంది తెలిపారు.