హెలికాప్టర్​ ప్రయాణాలు భద్రమేనా?

భారత్​ లోనూ పలు ప్రమాదాలు

May 22, 2024 - 15:47
 0
హెలికాప్టర్​ ప్రయాణాలు భద్రమేనా?

నా తెలంగాణ,సెంట్రల్​ డెస్క్​: ఇరాన్​ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్​ ప్రయాణంలో దుర్మరణంతో వీటిలో ప్రయాణాల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. భారత్​ లో కూడా పలు హెలికాప్టర్​ ప్రమాదాల్లో పలువురు ప్రముఖులు మృతి చెందారు. వాటి వివరాల్లేంటో తెలుసుకుందాం.

లెఫ్టినెంట్ జనరల్ విక్రమ్ సింగ్: 1963 నవంబర్​ 23న కాశ్మీర్​ పూంచ్​ సెక్టార్​ లో ఆర్మీ హెలికాప్టర్​ కూప్పకూలింది. టెలిగ్రాఫ్​ లైన్​ ను తాకడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లెఫ్టినెంట్ జనరల్ విక్రమ్ సింగ్, ఎయిర్ వైస్ మార్షల్ ఎర్లిక్ పింటో, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఎస్ఎస్ సోధితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు మొత్తం 6 మంది సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు.

గుజరాత్​ సీఎం బల్వంత్​ రాయ్​ మెహతా: 1965 సెప్టెంబర్​ భారత్​ – పాక్​ యుద్ధం జరుగుతున్న సమయంలో గుజరాత్​ సీఎం బల్వంత్​ రాయ్​ మెహతా ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ ను పాక్​ కూల్చివేసింది. ఈ ప్రమాదంలో సీఎం సహా 8 మంది చనిపోయారు. 

జిఓసి జమీల్ మెహమూద్‌: 1993లో ఎంఐ–8 హెలికాప్టర్​ కూలిన ఘటనలో ఆర్మీ ఈస్టర్న్ కమాండ్‌కు చెందిన జిఓసి జమీల్ మెహమూద్‌తో పాటు ఆయన భార్య, మరికొందరు ఆర్మీ అధికారులు - కల్నల్ ఎంఎన్ అహ్మద్, లెఫ్టినెంట్ లక్ష్మణ్ త్యాగి, జి త్యాగరాజన్, హవల్దార్ ఎస్ వాసుదేవన్, ఫ్లైట్ పైలట్ ఉన్నారు. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో అందరూ మృతిచెందారు. 

జీఎంసీ బాలయోగి: 2002 మార్చి 3న లోక్​ సభ స్పీకర్​, టీడీపీ నాయకుడు జీఎంసీ బాలయోగి ప్రయాణిస్తున్న బెల్​–206 హెలికాప్టర్​ చెరువులో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మృతిచెందారు.

మంత్రి సంగ్మా: 2004 సెప్టెంబర్​ 22న ప్రతికూల వాతావరణం కారణంగా మేఘాలయ మంత్రి సంగ్మా ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సంగ్మాతోపాటు మొత్తం పది మంది చనిపోయారు. 

ఓపీ జిందాల్​: 2005 మార్చి 31న హరియాణా మంత్రి ఓపీ జిందాల్​  ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ సహరన్​ పూర్​ లో ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో జిందాల్​ తోపాటు వ్యవసాయ శాఖ మంత్రి సురేంద్ర సింగ్​ మరికొంతమంది మృతిచెందారు.

సీఎం వైఎస్​ ఆర్​: 2009 సెప్టెంబర్​ 2న ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​.రాజశేఖర్​ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్​ లో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయారు. ఈ అదృశ్యంపై వైమానిక దళం అతిపెద్ద సెర్చ్​ ఆపరేషన్​ నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. 

సీఎం ధోర్జీ ఖండూ: 2011 మే లో అరుణాచల్​ ప్రదేశ్​ సీఎం ధోర్జీ ఖండూ, మరో నలుగురితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ పవన్​ హాన్స్​ ఏఎస్​బీ–350 బీ–3 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సీఎం దోర్జీతో సహా ఐదుగురు మృతి చెందారు.

ఆర్మీ చీఫ్​ బిపిన్​ రావత్​: 2021 డిసెంబర్​ 8న భారత ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తన భార్య మధులికా రావత్, మరో 12 మందితో కలిసి ఎంఐ–17  హెలికాప్టర్‌ ప్రతికూల వాతావరణం కారణంగా కుప్పకూలింది. ఈ ఘటనలో బిపిన్​ రావత్​ ఆయన భార్య మధులికా రావత్​, 12 మంది అధికారులు మృతి చెందారు.