త్వరలో ఉగ్రవాద నిరోధక విధానం

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

Nov 7, 2024 - 15:56
 0
త్వరలో ఉగ్రవాద నిరోధక విధానం
యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్​ 2024 ప్రారంభం
పదేళ్లలో ఉగ్రవాదంపై పెద్ద విజయం
జీరో టాలరెన్స్​ పాలసీకి కట్టుబడి ఉన్నాం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ:  జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని త్వరలోనే కేంద్రం తీసుకువస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా స్పష్​టం చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం ఉగ్రవాద నిర్మూలన చర్యలపై రెండు రోజుల మేధోమథన సమావేశం ప్రారంభమైంది.  యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్-2024ని అమిత్​ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో తీవ్రవాదం, ఉగ్రవాదంపై పెద్ద విజయాన్ని సాధించామన్నారు. ఉగ్రవాద రహిత భారతదేశానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని షా చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జీరో టాలరెన్స్​ పాలసీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రపంచం మొత్తం ఈ విధానాన్ని ఆమోదించిందని అమిత్​ షా పేర్కొన్నారు. 
 
డేటా సిస్టమ్​ మరింత బలోపేతం..
ఉగ్రవాద నిర్మూలనకు సమగ్ర వ్యవస్థ రూపకల్పనలో డేటా సిస్టమ్‌ను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. సాంకేతికత వినియోగాన్ని మరింత  పెంచుతాని తెలిపారు. ఎన్​ ఐఎ చట్ట అధికార పరిధిని సవరించామని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలను మరిత పటిష్ఠం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని తెలిపారు. ప్రస్తుతం దేశ విదేశాల్లో కూడా ఎన్​ ఐఎ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. 
 
యూఏపీఎ చట్ట సవరణ..
యూఏపీఎచట్టాన్ని సవరించడం ద్వారా ఆస్తులను జప్తు చేసేందుకు, సంస్థలను, వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు కేంద్రం అధికారాలు కల్పించిదన్నారు. జిహాదీ ఉగ్రవాదం నుంచి ఈశాన్య ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, నకిలీ కరెన్సీ, మాదకద్రవ్యాలు,  ఉగ్రవాదానికి నిధులను ఆపేందుకు 25 పాయింట్ల సమగ్ర ప్రణాళిక రూపొందించామని షా స్పష్టం చేశారు. 
 
ఎస్​ వోపీలతో నేరాలను అరికడుతున్నాం..
మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎంఎసీ) పరిధిని విస్తరించామని, సైబర్ సెక్యూరిటీ, నార్కో టెర్రర్, ఎమర్జింగ్ రాడికలైజేషన్ హాట్‌స్పాట్‌లను పర్యవేక్షించడానికి ఎస్​ వోపీలను రూపొందించామని, దీని కారణంగా అనేక నేరాలు జరగకముందే అరికట్టడంలో విజయవంతమవుతున్నామని కేంద్రమంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు.