కవిత బయటకు రావాలంటే ఈడీకి అనిల్ సహకరించాలి
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
నా తెలంగాణ, నిజామాబాద్: ఈడీ విచారణకు బీఆర్ఎస్ నాయకుడు, కవిత భర్త తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నాడని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. బుధవారం అరవింద్ మీడియాతో మాట్లాడారు. కవిత త్వరగా బయటకు రావాలంటే ఈడీకి అనిల్ సహకరిస్తే సరిపోతుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి ఒప్పందం లేదని ఈ అరెస్ట్‌తో తేలిపోయిందని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేశాకే సీఎం రేవంత్‌రెడ్డి పీఠాన్ని వీడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఐదేళ్లు ఆయన పాలన కొనసాగించాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోనే తమకు పోటీ అని రాష్ట్రంలో 16 లోక్‌సభ స్థానాల్లో గులాబీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత తనదని, అవసరమైతే రైతులకు బాండ్ రాసిస్తానని అరవింద్ పేర్కొన్నారు. ఎంపీగా గెలిచిన నెలలోనే ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తానని అరవింద్ వాగ్దానం చేశారు.