నా తెలంగాణ, నిర్మల్: దొరల పెత్తనాన్ని ఎదిరించిన చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మరువలేనిదని గుర్తు చేశారు. నాటి కాలంలోనే దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణా పోరాటాల చరిత్రలో ఒక గొప్ప అధ్యయనాన్ని లిఖించిందని తెలిపారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
చాకలి ఐలమ్మ లాంటి వీర వనితల చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. పీఎం విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా జిల్లాలో రజకులకు శిక్షణ కేంద్రాల ద్వారా భృతితో కూడిన శిక్షణను అందించి, గుర్తింపు పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన రజకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, పరిశ్రమల శాఖ అధికారి నరసింహ రెడ్డి, కుల సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.