ఫలితంగానే ఆరోపణల చిక్కుముళ్లు
సంస్థ కార్యకలాపాలతో డ్రాగన్ కు చుక్కలు
అమెరికాకు అంతర్గత చిరాకు
ప్రపంచదేశాల పెద్ద కాంట్రాక్టులకు అదానీ గ్రూప్ నకే
తమ మనుగడ అడుగంటుతుండడంతో ఆందోళన
ఫలితమే దేశ విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలిపి ఆరోపణలకు తెర
ప్రధాని మోదీ ఆర్థిక సంస్కరణలతో దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతున్న భారత్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: భారత బడా వ్యాపారులలో అత్యంత వేగంగా ప్రపంచదేశాల్లో విస్తరిస్తున్న సంస్థ అదానీ గ్రూప్. అనేక దేశాల్లో తమ ప్లాంట్లు, ప్రాజెక్టులను నెలకొల్పుతూ శరవేగంగా దూసుకుపోతుంది. ఫలితంగా భారత శత్రుదేశాల బడా సంస్థలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలకు ఇది నచ్చడం లేదు. అందుకే అదానీ గ్రూప్ ను కాంగ్రెస్ రాహుల్ గాంధీ, కూటమి పార్టీలు టార్గెట్ చేశాయని చెప్పక తప్పదు. వ్యాపార నిబద్ధతతో చేసుకున్న ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఆ సంస్థను బద్నాం చేసే విదేశీ శక్తులతో కలిసి పని చేస్తుంది. తొలుత హిండెన్ బర్గ్, ఇప్పుడు అమెరికా లంచం కేసు లాంటి ఆరోపణలు అదానీ సంస్థపై రుద్ధబడుతున్నాయనేది పలువురు బడా వ్యాపారులు భావిస్తున్నారు. అదీగాక బీజేపీకి అత్యధిక విరాళాలు ఇచ్చిన వారిలో ఈ సంస్థ ఉండడంతో కూడా కాంగ్రెస్ కు కంటగింపుగా మారింది. దీంతో విదేశీ శక్తులతో కలిసి ఎలాగైనా ఈ సంస్థను బద్నాం చేయాలనే ప్రయత్నం కొనసాగుతుంది.
అదానీయే టార్గెట్ ఎందుకు?..
భారత్ కు చెందిన అదానీ గ్రూప్ పలుదేశాల్లో తన వ్యవస్థను బలోపేతం చేసుకునే చర్యలు తీసుకుంటుంది. ఇదే సమయంలో భారత్ కు కూడా ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల మేలే జరుగుతుంది. ఆస్ర్టేలియా కార్మైకేల్ బొగ్గు గనిని స్థాపించింది. చైనా బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ ఐకి) ఆటంకాలు సృష్టించింది. మలేషియాలో కారీ ద్వీపంలో కార్గో నిర్వహణకు ఒప్పందం కుదిరింది. శ్రీలంక కొలంబో పోర్ట్ కంటైనర్ టెర్మినల్ నిర్మాణ బాధ్యతను అదానీ దక్కించుకుంది. విండ్ ఎనర్జీ ప్లాంట్లను కూడా స్థాపించింది. బంగ్లాదేశ్ కు విద్యుత్ సరఫరా చేస్తుంది. ఇజ్రాయెల్ లోని హైఫా పోర్ట్ లో 70 శాతం వాటాను పెట్టుబడులుగా పెట్టింది. సోలార్ తయారీ, లాజిస్టిక్స్, భూమి, రక్షణ, ఏరోస్పేస్, పండ్లు, డేటా సెంటర్లు, రోడ్లు, రైలు, రియల్ ఎస్టేట్ రుణాలు, బొగ్గు గనులు, కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూర్చే నిర్ణయాలను అదానీ గ్రూప్ చేస్తుంది. ఇదే సమయంలో ఆసియాలోని ఇంతకుముందు చైనానే ఈ పనులన్నీ నిర్వహించేంది. అదానీ రంగంలోకి దిగడంతో చైనా ప్రాజెక్టులకు భారీగా గండిపడింది. ఫలితంగా చైనా రియల్ ఎస్టేట్ కూడా కుప్పకూలే స్థాయికి చేరుకుంది. ఇదే అంశం ఇటు చైనాకు, అటు భారత శత్రుదేశాలకు, కొద్దో గొప్పో తమ దేశ మనుగడకు భవిష్యత్ లో సవాల్ గా నిలుస్తుందేమోననుకున్న అమెరికాలాంటి దేశాలకు కూడా అదానీ గ్రూప్ వేగవంతమైన చర్యలు తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఇక ఈ సంస్థ అభివృద్ధిని అడ్డుకోకుంటే తమ మనుగడ కష్టమేనని భావించాయి. ఈ నేపథ్యంలోనే భారత్ వ్యతిరేక శక్తులతో కలిసి కాంగ్రెస్ చేతులు కలిపి ఆరోపణలపై విదేశాల కంటే ముందుగానే గుండెలు బాదుకుంటోంది.
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల మతిలేని చర్యలు..
తానా అంటే తందనా అన్నట్లు అసలు ఆరోపణలు ఎందుకు వచ్చాయి? ఎవరిపై వచ్చాయి? ఇంతపెద్ద సంస్థపై ఏదైనా కుట్ర కోణమా? ఇంకెవరైనా భారత ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారా? అనే విషయాలను పరిశీలించకుండానే కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీ దేశ హితాన్నిపక్కన పెట్టి అదానీ గ్రూప్ పై ఆరోపణలు చేయడంలో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అదానీ గ్రూప్ పలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో చేపడుతున్న ప్రాజెక్టులపై కూడా విమర్శలు, ఆరోపణల బాణాలు ఎక్కుపెట్టింది. అసలు ఈ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల ప్రభుత్వాలు అదానీ గ్రూప్ సంస్థలకు పూర్తి న్యాయ, చట్టపరంగా ప్రాజెక్టులను కట్టబెట్టామన్న విషయాన్ని మరిచి కేవలం పార్టీ ప్రయోజనాలకే విలువనిస్తూ దేశ ప్రయోజనాలను మరిచిపోయినట్లు నటిస్తున్నాయి. ఇప్పుడు అదానీ ప్రాజెక్టులన్నీ అక్రమాలని, తాము వారితో కలిసి పనిచేయలేదని, లేదా వారి ప్రాజెక్టులు వెనక్కు తీసుకుంటున్నామని, వారిచ్చిన విరాళాలు తిరిగి ఇచ్చేస్తున్నామని మొక్కుబడి నిర్ణయాలతో తమ రాష్ర్ట భవిష్యత్ ను కూడా అంధకారంలోకి నెట్టుకుంటున్నాయి.
ఆర్థిక రేటింగ్ లోనూ అదానీ ముందంజే..
మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల రేటింగ్ లో కూడా అదానీ గ్రూప్ పై వరుసలో ఉంది. ఆర్థికంగా భారత మార్కెట్లలోనే గాకుండా, విదేశీ మార్కెట్ల క్యాపిటలైజేషన్ లో కూడా క్రమేణా బలపడుతోంది. దీంతో అదానీ గ్రూప్ పై విదేశీ శక్తులు, కాంగ్రెస్ కు అసూయ, ఈర్షాద్వేషాలు పెరుగుతున్నాయి. మరోవైపు గత పదేళ్లలో ప్రధాని మోదీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో భారత ఆర్థిక రంగం పటిష్ఠంగా మారుతోంది. అదే సమయంలో నిబంధనల ప్రకారం భారతీయ సంస్థలు వ్యాపార విఫణిలో దూసుకువెళుతున్నాయి. దీంతో సంస్థలకు లాభాలే గాకుండా భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. అదే సమయంలో ప్రపంచదేశాల్లో కూడా భారతీయ సంస్థలు బడా కాంట్రాక్టులను దక్కించుకుంటూ పై వరుసలో నిలుస్తున్నాయి.
చేయి చాపడం నుంచి సాయమందించే దిశగా భారత్..
స్వాతంత్ర్యం సిద్ధించాక విదేశాల నుంచి భారత్ రుణాలు తీసుకోవడం, పెట్టుబడులని పెట్టండర్రా అని అడుక్కోవడమే తప్ప ఏనాడు ఆర్థిక సంస్కరణల బలోపేతానికి సరైన చర్యలు తీసుకోలేదు. గత పదేళ్ల మోదీ ప్రభుత్వ హయాంలో ప్రపంచదేశాలు, ఆర్థిక సంస్థలు భారత్ వైపే పెట్టుబడులు, రుణాల వైపు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో భారత్ ఎదుగుతున్న మోనోపాలి దేశంగా నిలిచేందుకు ఎంతో దూరంలో లేదు. ఇదే అంశం కొన్ని శత్రుదేశాలు, దేశంలో ఉంటున్న విచ్ఛిన్నకర శక్తులకు రుచించడం లేదు. ఏది ఏమైనా ప్రధాని మోదీ ఆర్థిక సంస్కరణలు కేవలం అదానీ గ్రూప్ కే కాదు భారత్ లోని అన్ని వ్యాపార వర్గాల అభివృద్ధికి అవకాశం కల్పించినట్లయింది. ఫలితంగా అన్ని రంగాల్లో భారత్ దినదినప్రవర్థమానంగా మారుతోంది.
షేర్లు రయ్ రయ్..
మరోవైపు అదానీ గ్రూప్ పై ఆరోపణలతో ఒకటి, రెండుసార్లు విపక్షాలు సక్సెస్ సాధించినా, ప్రస్తుత తరుణంలో దేశ ప్రజలు వారిని, వారి మాటలు, ఆరోపణలను నమ్మేలా లేరు. తాజాగా వచ్చిన లంచం ఆరోపణల నేపథ్యం నుంచి నేటి వరకూ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిసినా అదానీ గ్రూప్ సంస్థల షేర్లు మాత్రం పై పై కే వెళుతుండడం గమనార్హం. దీంతో విపక్ష కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామాలు చెంపపెట్టులా (హస్తానికి పచ్ కడ్) మారాయి.